కూకట్ పల్లిలో బతుకమ్మ పండుగలో అపశృతి.. హై టెన్షన్ లైన్ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలు

కూకట్ పల్లిలో బతుకమ్మ పండుగలో అపశృతి.. హై టెన్షన్ లైన్ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: కూకట్ పల్లిలో సద్దుల బతుకమ్మ  పండుగలో అపశృతి చోటు చేసుకుంది. కూకట్ పల్లి డివిజన్లోని మాధవరం కాలనీ వద్ద భారీగా పేర్చిన బతుకమ్మను తీసుకొని వెళ్లే క్రమంలో హై టెన్షన్ లైన్ తగిలి ముగ్గురు వ్యక్తులకి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు అంబులెన్స్ ద్వారా గాయాలు అయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో కూడా ఇలాంటి విషాదమే జరిగింది. బతుకమ్మ పూల కోసం వెళ్లి అశోక్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంక్లో పడి అశోక్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు.

సెప్టిక్ ట్యాంక్ నుంచి అశోక్ రెడ్డి డెడ్ బాడీని హైడ్రా డిజాస్టర్ టీం బయటకు తీసింది. బతుకమ్మ పూలు తెంపేందుకు వెళ్లి సెప్టిక్ గుంతలో అశోక్ రెడ్డి పడిపోయాడు. ఎవ్వరూ గమనించకపోవడంతో  ఊపిరాడక చనిపోయాడు. ఎంతసేపటికీ అశోక్ రెడ్డి రాకపోవడంతో అనుమానం వచ్చి వెతుక్కుంటూ వెళ్లిన అతని కుటుంబ సభ్యులకు సెప్టిక్ ట్యాంక్ దగ్గర విషాద దృశ్యం కనిపించింది. అశోక్ రెడ్డి సొంతూరు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేర్ గూడ కాగా గత కొంత కాలంగా హయత్ నగర్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అశోక్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు.