లిఫ్ట్​లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడి మృతి .. ఎల్​బీనగర్​లో దారుణం

లిఫ్ట్​లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడి మృతి .. ఎల్​బీనగర్​లో దారుణం

ఎల్ బీనగర్, వెలుగు : లిఫ్ట్​లో ఇరుక్కుని గాయపడి బాలుడు చనిపోయిన ఘటన ఎల్​బీనగర్​లోని ఆర్టీసీ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  సూర్యాపేట జిల్లా పెన్​పహడ్ మండలం ధర్మపురానికి చెందిన నాగరాజు, అనురాధ దంపతులు కొంతకాలం కిందట సిటీకి వచ్చి ఎల్ బీనగర్ పరిధి ఆర్టీసీ కాలనీలో కొత్తగా కట్టిన ఇంటికి వాచ్​మన్​గా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరి పిల్లల్లో ఒకరైన అక్షయ్ కుమార్(4) తన తల్లిదండ్రులు పనిచేస్తున్న భవనంలోని లిఫ్ట్​లో ఆడుకుంటూ కిందకు వెళ్లాడు.

లిఫ్ట్ సరిగా పని చేయకపోవడంతో అందులో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. అక్షయ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పిల్లాడి కోసం చుట్టుపక్కల వెతికారు. లిఫ్ట్ నుంచి రక్తం కారుతుండటంతో దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో పక్కనే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద పనిచేస్తున్న కొంతమంది కార్మికులను తీసుకొచ్చారు. వారి సాయంతో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగా.. అక్షయ్ గాయాలతో కనిపించాడు. అతడిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ అక్షయ్ మృతి చెందాడు. బాలుడి డెడ్ బాడీని పోలీసులు ఉస్మానియాకు తరలించారు.