అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్ను సందర్శించిన ట్రైనీ కలెక్టర్స్

అశ్వారావుపేట  అగ్రికల్చర్ కాలేజ్ను సందర్శించిన ట్రైనీ కలెక్టర్స్

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్ ను శుక్రవారం ట్రైనీ కలెక్టర్స్ సందర్శించారు. డిప్యూటీ కలెక్టర్ మురళి ఆధ్వర్యంలో న్యూఢిల్లీ, ముంబైకి చెందిన ట్రైనీ కలెక్టర్స్ జాహ్నవి, సోనాల్ గోగె కలిసి కళాశాలలో స్టూడెంట్స్ సాగు చేస్తున్న కొబ్బరి, ఆయిల్ పామ్, పత్తి, కోకో, గులాబీ తోటలను పరిశీలించారు. కళాశాలలో ఆయిల్ పామ్​, ఉద్యాన పంటల సాగు గురించి కళాశాల డీన్ హేమంత్ కుమార్ వివరించారు. 

ప్రతి ఏడాది కాలేజీ నుంచి స్టూడెంట్స్ విశ్వవిద్యాలయ స్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా గుర్తింపు పొందుతున్నారని ట్రైనీ కలెక్టర్స్ కు తెలియజేశారు. కళాశాలలో భూసార పరిరక్షణ వరి పంటల సాగుపై డాక్టర్ రాంప్రసాద్ తెలుపగా, వర్మీ కంపోస్ట్, పుట్టగొడుగుల తయారీపై డాక్టర్ నీలిమ, డాక్టర్ దీపక్ రెడ్డి వివరించారు. 

కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ వివరాలు ఉద్యోగ, ఉపాధి, సేవా రంగ అవకాశాలను ట్రైనీ కలెక్టర్స్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయిల్ పామ్​ నర్సరీ, ఫ్యాక్టరీలను సందర్శించారు.ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ రామకృష్ణ కళాశాల ప్రొఫెసర్స్ పాల్గొన్నారు.