ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్, వెలుగు: ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌‌‌‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్‌‌‌‌ వేటు వేసింది. హైదరాబాద్‌‌‌‌లోని సర్దార్‌‌‌‌ వల్లభాయ్‌‌‌‌ పటేల్‌‌‌‌ జాతీయ పోలీస్‌‌‌‌ అకాడమీలో ట్రైనింగ్‌‌‌‌ కోసం ఈ నెల 2న జారీ చేసిన అపాయింట్‌‌‌‌మెంట్‌‌ను సస్పెండ్ చేసింది. మహేశ్వర్ రెడ్డి పై ఫైల్‌‌‌‌ అయిన వరకట్న వేధింపుల కేసు విచారణ పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామంది. కడప జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఆ సమయంలో కీసరకు చెందిన భావనతో ప్రేమ వ్యవహారం నడిపాడు. గతేడాది ఫిబ్రవరిలో ఆమెను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సివిల్స్‌‌‌‌కు ప్రిపేర్ అయిన మహేశ్వర్‌‌‌‌రెడ్డి 126 వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌‌‌‌ సాధించాడు. ఐపీఎస్‌‌‌‌కు సెలక్ట్ అయ్యాక మహేశ్వర్‌‌‌‌రెడ్డి మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, కులం, వరకట్నం పేరుతో వేధింపులకు గురి చేశాడని భావన ఆరోపించింది. అక్టోబర్ 27న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కీసర రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు ఫైల్ చేసింది. దీంతో మహేశ్వర్‌‌‌‌రెడ్డిపై ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదైంది. కేసు దర్యాప్తులో ఉంది.