యాదగిరిగుట్ట, వెలుగు: భక్తులకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఆలయాల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే లక్ష్యంతోనే ఆలయ సిబ్బంది, అర్చకులకు శిక్షణా తరగతులు నిర్వహించామని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవానీ శంకర్ తెలిపారు.
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(సిటా) ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 వరకు కొండపైగల ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి.
సిటా డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యుల పర్యవేక్షణలో అధ్యాపకుల బృందం ఆగమ శాస్త్రానుసారమైన పూజా విధానాలు, భక్తులతో మర్యాదపూర్వక వ్యవహారం, పరిపాలన, భద్రత, పరిశుభ్రతపై సమగ్ర శిక్షణ ఇచ్చారు. ఆలయ మాజీ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు హాజరై పలు సూచనలు చేయగా, శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది, అర్చకులకు సిటా తరఫున ప్రశంసా పత్రాలను అందజేశారు.
