కరీంనగర్ కలెక్టర్, సీపీపై బదిలీ వేటు

కరీంనగర్ కలెక్టర్, సీపీపై బదిలీ వేటు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడింది. ఇప్పటికే రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ ఫర్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. కరీంనగర్ కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడిని బదిలీ చేయాలని సీఎస్ ను శుక్రవారం ఆదేశించింది. ఆ ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. వారిద్దరూ వెంటనే కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి, సాధారణ పరిపాలన శాఖ(జీడీఏ)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇరువురికీ ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు.  ఈ రెండు పోస్టులకు సంబంధించి శనివారం ప్యానెల్ పంపాలని సూచించింది. 

అధికారులపై వరుస కంప్లయింట్స్​ 

ఈ నెల మొదటి వారంలో ఎలక్షన్​ కమిషన్ బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఆ సందర్భంగా అధికార బీఆర్ఎస్ మినహా అన్ని పొలిటికల్ పార్టీలు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఇతర అధికారులపై ఫిర్యాదు చేశాయి. ఆ తరువాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు మరో ఇద్దరు సీపీలను ఈసీ మార్చింది. పలు జిల్లాల ఎస్పీలతో పాటు నాలుగు జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. పలు శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఉన్న ఇన్​చార్జి బాధ్యతలను తొలగించింది. టాస్క్​ఫోర్స్ డీసీపీని కూడా మార్చింది. ఇలా ఆఫీసర్లపై వస్తున్న కంప్లయింట్స్​పై ఈసీ సీరియస్​గా వ్యవహరిస్తున్నది. డీజీపీతోపాటు సైబరాబాద్ సీపీపైనా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.