ట్రాన్స్ ఫార్మర్ ఎర్తింగ్ వైరు తాకి బాలుడు మృతి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘటన

ట్రాన్స్ ఫార్మర్  ఎర్తింగ్ వైరు తాకి బాలుడు మృతి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘటన

తొగుట(దుబ్బాక), వెలుగు: సెలవులను సరదాగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు విద్యుత్ షాక్‌‌‌‌కు గురై మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం..

 నారాయణరావుపేట మండలం మల్యాలకు చెందిన శంకర్ గౌడ్, నిర్మల దంపతుల కొడుకు చరణ్ తేజ(11) తన అక్కతో కలిసి సెలవులు గడిపేందుకు మంగళవారం సాయంత్రం అప్పనపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. 

బుధవారం ఉదయం అక్కతో కలిసి రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, సమీపంలోని విద్యుత్ స్తంభంపై ఏర్పాటు చేసిన సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్‌‌‌‌కు చెందిన ఎర్తింగ్ తీగ బాలుడి కుడిచేతికి తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌‌‌‌కు గురైన చరణ్ తేజ అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి మేనమామ భానుచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.