ఇంటికి కొత్త అందం తెచ్చే ఫ్లోటింగ్ డెకర్స్​

ఇంటికి కొత్త అందం తెచ్చే ఫ్లోటింగ్ డెకర్స్​

ఇంటి అలంకరణ అనగానే గోడలు, రంగులు మాత్రమే అనుకుంటారు చాలామంది.  అయితే గదుల్లో ఖాళీగా ఉండే బోలెడంత స్పేస్‌‌ను కూడా డెకరేట్ చేయొచ్చంటున్నారు డిజైనర్లు. దీనికోసం సీలింగ్ నుంచి వేలాడదీసే ఫ్లోటింగ్ డెకర్స్​ను వాడుతున్నారు. ఇంటి గోడల నిండా డెకరేషన్ వస్తువులు నింపే బదులు కొన్ని క్రాఫ్ట్స్‌‌ను గాలిలో వేలాడదీస్తే గదుల్ని మరింత అందంగా డిజైన్ చేయొచ్చు. వేలాడదీసే వస్తువులతో ఇంటికి స్పెషల్ లుక్ వస్తుంది. వీటిని కేవలం అందం కోసమే కాకుండా రకరకాల పనులకు కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ అవుతున్న కొన్ని ఫ్లోటింగ్ డిజైన్స్ ఇవీ..

కుండీలు
గాలిలో వేలాడుతూ ఉండే మొక్కలు ఇంటికి అందాన్ని తెస్తాయి. పచ్చగా పెరిగే తీగలను లివింగ్ రూమ్ కార్నర్స్‌‌లో లేదా బాల్కనీలో వేలాడదీస్తే బాగుంటుంది.

పేపర్ బర్డ్స్
రంగురంగుల కాగితాలతో చేసే ఆరిగమీ ఆర్ట్ వర్క్‌‌ కూడా సీలింగ్‌‌కు వేలాడదీయొచ్చు. పిల్లల గదిలో అలంకరించడానికి ఇవెంతో బాగుంటాయి. వీటి తయారీ చాలా ఈజీ. ఒక దారం తీసుకుని, వాటికి రంగురంగుల ఆరిగమీ బర్డ్స్‌‌ అతికించడమే.  

ల్యాంప్స్
బెడ్ రూంలో వేలాడదీసేందుకు వీలుగా రకరకాల హ్యాంగింగ్ ల్యాంప్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. పెద్దపెద్ద షాండ్లియర్లకు బదులు వీటిని వేలాడదీస్తే పడక గది సింపుల్‌‌గా, అట్రాక్టివ్‌‌గా కనిపిస్తుంది.

వాల్ డివైడర్స్
కిచెన్ లేదా డైనింగ్‌‌రూమ్‌‌ని హాలు నుంచి సెపరేట్ చేసేందుకు వాల్ డివైడర్స్ బాగా పనికొస్తాయి. ‘బియడ్ వాల్ డివైడర్స్’తో పేరుతో రకరకాల డిజైన్లలో ఇవి దొరుకుతున్నాయి. వీటిని కర్టెన్‌‌లా వేలాడదీస్తే అందమైన గోడ రెడీ.

షెల్వ్స్
వాల్ షెల్వ్స్ ఒకప్పటి ఫ్యాషన్. ఇప్పుడు కొత్తగా హ్యాంగింగ్ షెల్వ్స్ వస్తున్నాయి. వీటిని సీలింగ్ నుంచి ఎంత ఎత్తులో కావాలో చూసుకుని వేలాడదీయొచ్చు. ఇందులో అరల వారీగా బోలెడు డిజైన్స్ ఉన్నాయి. డిజైన్‌‌ను బట్టి వీటిలో పుస్తకాలు, కప్పులు, డెకరేటివ్ వస్తువులు వంటివి పెట్టుకోవచ్చు. 

ఎగ్ షేప్డ్ నెస్ట్
సోఫా టేబుల్  దగ్గర రెండు పక్షి గూళ్లను వేలాడదీస్తే హాలుకే అందం వస్తుంది. ఇవి రకరకాల మెటీరియల్స్, కలర్స్‌‌లో అందుబాటులో ఉన్నాయి. 

ఫ్లోటింగ్ నైట్‌‌స్టాండ్   
మంచం పక్కన స్టాండ్ ఉంచుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. వీళ్లకోసం డిజైన్ చేసిందే  ఫ్లోటింగ్ స్టాండ్. దీన్ని నచ్చిన ఎత్తులో బెడ్ పక్కన వేలాడదీయొచ్చు. పడుకునే ముందు పుస్తకాలు, కళ్లద్దాలు లాంటివి దీనిమీద పెట్టుకోవచ్చు.