- ఇంకా విషమంగానే మరో ఇద్దరి పరిస్థితి
జూబ్లీహిల్స్, వెలుగు: తోటి ట్రాన్స్‌జెండర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన 8 మందిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ట్రాన్స్ జెండర్ లీడర్ మోనాలిసా వేధింపులు తట్టుకోలేక కొందరు ట్రాన్స్ జెండర్లు ఆమెకు వ్యతిరేకంగా ఈ నెల 17న బోరబండ బస్టాండ్‌వద్ద నిరసనకు దిగారు. పదుల సంఖ్యలో ట్రాన్స్ జెండర్లపై మోనాలిసా అక్రమ కేసులు పెట్టించిందని, వారిని భయపెట్టి వ్యభిచార కూపంలోకి నెట్టిందని ఆరోపించారు. ఈ క్రమంలో పెట్రోల్ పోసుకొని 8 మంది ట్రాన్స్జెండర్లు ఆత్మహత్యాయత్నం చేశారు.
వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, అప్సాన గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అప్సాన స్వస్థలమైన వరంగల్ కు మృతదేహాన్ని తరలించి వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ట్రాన్స్ జెండర్ లీడర్ మోనాసాలిను పోలీసులు అరెస్ట్ చంచల్ గూడ జైలుకు తరలించారు. మోనాలిసా పై మహంకాళి పీఎస్‌లో 3 కేసులు, బంజారా హిల్స్‌లో ఒకటి, బాలానగర్ పరిధిలో ఒక కిడ్నాప్ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
