మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యావత్ ప్రపంచం యోగా వైపు చూస్తోంది. మేము సైతం అంటూ థర్డ్ జెండర్లు కూడా తమలోని ఒత్తిడిని జయించేందుకు యోగా వైపు అడుగులు వేస్తున్నారు. యోగా, ధ్యానం నేర్చుకుని తమ తోటి వారికి నేర్పిస్తూ ఔరా అనిపిస్తున్నారు. చిన్న పట్టణాల నుంచి మొదలుకొని మెట్రో పాలిటిన్ సిటీల వరకూ అన్నిచోట్లా యోగా శిక్షణ కేంద్రాలు పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే వరంగల్ లోని థర్డ్ జెండర్లు కూడా యోగాపై ఫోకస్ పెట్టారు. జిల్లా పిరమిడ్ అసోసియేషన్ సహకారంతో ప్రత్యేక ధ్యాన కేంద్రాన్ని నిర్మించుకున్నారు. పిరమిడ్ దగ్గర ఉదయం, సాయంత్రం యోగా సాధన చేస్తున్నారు.
సమాజంలో వివక్ష, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని థర్డ్ జెండర్స్ అంటున్నారు. దీనివల్లే తాము యోగా, ధ్యానం నేర్చుకుంటున్నామని చెబుతున్నారు. యోగా ఉపయోగాలు తెలిసినా.. ఎక్కడ తమపై వివక్ష చూపుతారో అన్న భయంతో ఇన్నాళ్లూ మిగతా వారితో యోగా శిక్షణ కేంద్రాలకు వెళ్లలేకపోయామని వారు అంటున్నారు. యోగా నేర్చుకోవాలని ఒక థర్డ్ జెండర్ తమ దగ్గరకు రావడంతో.. అతడిలా ఆసక్తి ఉన్న అందరికి యోగాను నేర్పించే సదుద్దేశంతో పిరమిడ్ మందిరాన్ని నిర్మించామని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. హెల్త్ విషయంలో కేరింగ్ తో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు థర్జ్ జెండర్స్.
