ఆన్లైన్ వాల్యుయేషన్‌తో పారదర్శకత : నవీన్ మిట్టల్

ఆన్లైన్ వాల్యుయేషన్‌తో పారదర్శకత : నవీన్ మిట్టల్

ఆన్ లైన్ వాల్యుయేషన్ తో పారదర్శకత ఉంటుందని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు.  ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు తదితర క్రిమినల్ కేసుల కారణంగా సస్పెండైన ఒక జూనియర్ లెక్చరర్ బోర్డు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంబంధం, అర్హత లేని వ్యక్తి బోర్డు వాల్యుయేషన్ సిస్టంపై అనుమానాలు, అపోహలు సృష్టించారని ఆరోపించారు. ఆన్ లైన్ విధానం ద్వారా ఇంట్లో నుంచే వాల్యుయేషన్ చేయవచ్చని అన్నారు. ఈ విధానం వల్ల ఖర్చు, పనిభారం పూర్తిగా తగ్గడంతో పాటు అక్యురేట్ గా వాల్యుయేషన్ చేయవచ్చని నవీన్ మిట్టల్ తెలిపారు. నూతన విధానం వల్ల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కూడా సులభంగా చేయవచ్చని అన్నారు. 

ఎగ్జామినేషన్  ప్రక్రియను కంట్రోల్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు తమ చేతుల నుంచి ఆ వ్యవస్థ చేజారి పోతుందనే భయంతో బోర్డుపై ఆరోపణలు చేస్తున్నారని నవీన్ మిట్టల్ ఆరోపించారు. ఈ ఏడాది ఆర్ట్స్, కామర్స్ పేపర్లు మాత్రమే ఆన్ లైన్ ద్వారా వాల్యుయేషన్ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో తప్పుడు ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలకు బిడ్డింగ్ కు అనుమతి ఇవ్వడం లేదని.. ఇప్పడికే ఓయూ, అంబేద్కర్ వర్సిటీలు ఆన్ లైన్ ద్వారా స్పాట్ వాల్యుయేషన్ చేయగా ఎలాంటి సమస్య తలెత్తలేదని అన్నారు.