త్వరలో డ్రోన్ల ద్వారా రవాణా 

త్వరలో డ్రోన్ల ద్వారా రవాణా 
  • ప్రారంభించనున్న స్పైస్ ఎక్స్‌‌ప్రెస్‌‌, డెల్హివరీ

న్యూఢిల్లీ: డ్రోన్ విమానాలతో వస్తువుల డెలివరీల కోసం ఎయిర్‌‌ కార్గో ఫర్మ్ స్పైస్ ఎక్స్‌‌ప్రెస్‌‌, ఈ–కామర్స్ లాజిస్టిక్ కంపెనీ డెల్హివరీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందుకోసం 3,4 నెలల్లో ట్రయల్స్ చేస్తామని ప్రకటించాయి.ఈ ప్రాజెక్టు కోసం అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. ఇండియాలో బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్ఓఎస్) డ్రోన్ల ద్వారా ట్రయల్స్ చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీ స్పైస్‌‌జెట్‌‌, స్పైస్ ఎక్స్‌‌ప్రెస్‌‌ ల కన్సార్షియాన్ని ఎంపిక చేసింది. ఈ ఒప్పందం లాజిస్టిక్ సెక్టార్‌‌కు కీలకంగా మారుతుందని, దీనివల్ల రెండు కంపెనీలూ లాభపడతాయని స్పైస్ ఎక్స్‌‌ప్రెస్‌‌ సీఈఓ సంజీవ్ గుప్తా చెప్పారు. రాబోయే నాలుగు నెలల్లోపు ట్రయల్స్ ఉంటాయని వెల్లడించారు. స్పైస్ ఎక్స్‌‌ప్రెస్‌‌ తో తమకు ఉన్న దోస్తానాకు ఈ ఒప్పందమే ఉదాహరణ అని డెల్హివరీ సీఈఓ చెప్పారు. డ్రోన్ల ద్వారా లాజిస్టిక్ ఎకోసిస్టమ్‌‌ను మార్చడానికి సాధ్యమైనంత కష్టపడతామని చెప్పారు.  అత్యవసర సేవలు, కార్గో డెలివరీ, మందులు అందించడం, పర్యావరణ పర్యవేక్షణ వంటి అనేక అవసరాల కోసం చాలా దేశాల్లో డ్రోన్లను వాడుతున్నారు.  డ్రోన్లను ఉపయోగించి టీకాలను ప్రయోగాత్మకంగా డెలివరీ చేయడానికి ఈ ఏడాది మేలో  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ   తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. వ్యాక్సిన్లను పంపిణీ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)  డ్రోన్‌‌లను ఉపయోగించడంపై స్టడీ చేయడానికి కూడా ఓకే చెప్పింది.