- యాదాద్రి జిల్లాలో టైగర్‌ను పట్టుకునేందుకు ట్రాప్ కేజ్‌లు .
హైదరాబాద్, వెలుగు : మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వచ్చిన పులి కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాత్రివేళ్లలో పులి ఎక్కడెక్కడ సంచరిస్తుందనేది తెలుసుకునేందుకు థర్మల్ డ్రోన్లతో నిఘా పెట్టారు. పులిని పట్టుకునేందుకు ట్రాప్ కేజ్‌లు సిద్ధం చేశారు. వన్యప్రాణి నిపుణులు, వెటర్నరీ టీమ్ లు రంగంలోకి దింపారు. ఇప్పటికే పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పులి కదలికలను గుర్తించారు. దీంతో ఫారెస్ట్ఆఫీసర్లు ఆరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో తిరుగుతున్న పులి ముందుకెళ్లడం లేదని , అక్కడక్కడే సంచరిస్తుందని ఆఫీసర్లు గుర్తించారు. టైగర్ వచ్చిన దారిలోనే వెళ్తుందా..? ముందుకెళ్తుందా..? అనేది అంతుచిక్కడం లేదు. కానీ ఇప్పటివరకు పులిని ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. పశువులపై దాడి చేసిన ఆనవాళ్లు గుర్తించినా.. దాని జాడ తెలియలేదు. పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ.. అది వెళ్లే మార్గాల్లోని గ్రామస్తులను ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. కలెక్టర్లు, పోలీస్ అధికారులతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ పశువులపై దాడులు జరిగిన చోట జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పులికి హాని తలపెడితే చర్యలు : పీసీసీఎఫ్
రాష్ట్రంలో సంచరిస్తున్న పులి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణ పేర్కొన్నారు. పులి మనుషులకు దూరంగా ఉండే స్వభావం కలిగినదని, కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో జిల్లాల్లో సంచరిస్తోందన్నారు. ప్రజలు అనవసరంగా భయపడి పులికి హాని తలపెట్టే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
