
- సిద్దిపేటలో ఇష్టారీతిగా చెట్ల నరికివేత
- పట్టణంలో పచ్చదనానికి తూట్లు
సిద్దిపేట, వెలుగు : పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి దశాబ్ద కాలంగా సిద్దిపేట మున్సిపాల్టీ చేపట్టిన చర్యలు ఇప్పుడు వట్టిపోతున్నాయి. పెద్ద ఎత్తున నాటిన మొక్కలు చెట్లుగా ఏపుగా ఎదిగాయి. కొంత కాలంగా విద్యుత్ వైర్ల కు అడ్డొస్తున్నాయనే కారణంగా చెట్లను ఇష్టారీతిగా నరికివేస్తున్నారు. ఒకప్పుడు చెట్టు కొమ్మను నరకాలంటే ఒకటికి రెండు సార్లు పట్టణ ప్రజలు ఆలోచించేవారు. తమకు ఇబ్బంది కలిగిస్తున్న చెట్ల విషయంపై మున్సిపాల్టీ లో దరఖాస్తు చేస్తే సిబ్బంది ఫీల్డ్ విజిట్ చేసి అనుమతిస్తేనే వాటి కొమ్మలు మాత్రమే నరికేవారు.
కానీ, ఈమధ్య మాత్రం విద్యుత్ వైర్లకు అడ్డుగా వుంటున్నాయంటూ షాపుల ముందున్న చెట్లను అడ్డంగా నరికివేయడం పరిపాటిగా మారింది. చెట్ల కొమ్మల నరికివేతకు సంబంధించి విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్ల వందలాది చెట్లు నరికివేతకు గురయ్యాయి. రెండు శాఖల సిబ్బంది కలిసి వైర్లకు అడ్డుగావున్న చోట్ల మాత్రమే కొమ్మలను నరకాల్సిఉంది. కానీ అడ్డగోలుగా నరికివేస్తున్నా అడిగేవారు కరువయ్యారు. కొన్ని చోట్ల అసలు విద్యుత్ వైర్లే లేకున్నా చెట్లను అడ్డంగా నరికివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవైపు వనమహోత్సవం పేరిట మొక్కలు నాటాలని ప్రఛారం చేస్తుంటే.. మరో వైపు వందల సంఖ్య లో చెట్లను కూల్చడం ఆందోళన కలిగిస్తోంది.
స్వచ్చ అవార్డు
పుష్కర కాలంగా చేస్తున్న ప్రయత్నాల వల్ల సిద్దిపేట పట్టణంపచ్చదనాన్ని సంతరించుంది. పట్టణంలోని ప్రధాన రోడ్ల తో పాటు డివైడర్లు, ప్రభుత్వ ఆఫీసులు, ఖాళీ ప్రదేశాల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా మున్సిపాల్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రతి ఏటా మొక్కల పెంపకం కోసం మున్సిపాల్టీ రూ. 50 లక్షలు ఖర్చు చేస్తూవస్తోంది. ఈ నిధులతో మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ, ట్యాంకర్ల తో నీటి సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు. ఇక్కడ మొక్కల సంరక్షణను కేంద్రం గుర్తించి స్వచ్చ సర్వేక్షణ్ కింద మున్సిపాల్టీకి అవార్డును ఇచ్చింది.
ప్రత్యేకంగా హరితహారం అధికారి
సిద్దిపేట మున్సిపాల్టీలో మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా హరితహారం అధికారిని నియమించారు. పట్టణంలో మొక్కల సంరక్షణ, నీటి సరఫరాను ఆయన పర్యవేక్షించేవారు. పట్టణంలో చెట్టు కొమ్మను నరికినా సీసీ కెమెరాలతో పరిశీలించి నరికిన వారిని గుర్తించి హరితహారం అధికారి జరిమానాలు విధించేవారు. అయితే ఇటీవల మొక్కల సంరక్షణపై అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.
రెండు రోజుల కిందట హైదరాబాద్ రోడ్డు లో ఐదు చెట్లను పూర్తిగా నరికివేసినా ఇప్పటి హరితహారం అధికారితనకు సమాచారం లేదని చెప్పడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల నరికివేతకు కొందరు మున్సిపల్ సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ వైర్లు, ఇతర కారణాల పేరిట పచ్చదనానికి తూట్లు పొడుస్తూ ఇష్టారీతిగా చెట్ల నరికివేతను మున్సిపల్ అధికారులు కంట్రోల్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.