వాళ్ల కల్చర్ లోనే సోషల్ డిస్టెన్స్..కరోనా ఫ్రీగా గిరిజన జిల్లా

వాళ్ల కల్చర్ లోనే సోషల్ డిస్టెన్స్..కరోనా ఫ్రీగా గిరిజన జిల్లా

భద్రాచలం, వెలుగుకరోనా వేళ ప్రపంచమంతా సోషల్, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా మారింది. కరోనా వైరస్‍ సోకకుండా ఉండాలంటే ఈ విధానాలు తప్పనిసరిగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. మనిషికి మనిషికి మధ్య దూరం పాటించాలని నిత్యం ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సోషల్  డిస్టెన్స్ అనేది ఆదివాసీల సంస్కృతిలో ఓ భాగం. అది వారి ఆచారం. కరోనా వేళ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. జిల్లాలో కోయ, కొండరెడ్లుకు చెందిన తెగల ఆచారాలు నాగరిక సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

ఎడంగా ఇండ్లు

ఆదివాసీలు  నిర్మించుకునే  పూరి గుడిసెల్లో వారిదైన సంస్కృతి కనిపిస్తుంది. ఇంటికి ఇంటికి మధ్య చాలా దూరం ఉంటుంది. ఎవరి పొలంలో వారు ఇల్లు కట్టుకుని బతుకుతుంటారు. వారి ఇల్లే ఓ ఐసోలేషన్‍ . ఇక ఊళ్లో ఏ పంచాయతీ పెట్టినా వారు కూర్చునే విధానం సైతం ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకరికి ఒకరు దూరంగా, ఎడంగా కూర్చుంటారు. అనవసరంగా బయట తిరగరు. ఇక ఎక్కడికైనా రేషన్‍, నిత్యావసర వస్తువుల కోసం వెళ్తే ఒకరిని ఒకరు తోసుకోరు. మీద పడరు. తమవంతు వచ్చేవరకు వేచి చూస్తారు. తీసుకువెళ్తారు. సోషల్ డిస్టెన్స్ ను ఇంత చక్కగా పాటిస్తున్నారు కాబట్టే ఎక్కువ మంది ఆదివాసీలు జీవించే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ‘కరోనా’ ప్రభావం అంతగా లేదు.  జిల్లాలో నాలుగు కేసులు నమోదైనా అందరికీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా ఫ్రీ జిల్లాగా మారింది.

వింతగా ఆచారాలు

ఆదివాసీ తెగల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. కలిసి కట్టుగా పట్టుకునే చేపలను పంచుకునేందుకు వారు కూర్చునే విధానం సోషల్ డిస్టెన్స్ ఎలా పాటిస్తారో కళ్లకు కడుతుంది. ఇక గిరిజన తెగల్లోని గర్భిణులు పురుడు పోసుకునేందుకు వీలుగా ఊరి బయట పురిటి పాకను నిర్మిస్తారు. పురుడు పోసుకుని, పురిటి స్నానం పూర్తయ్యేంత వరకు బాలింత ఆ పాకలోనే ఉంటుంది. బయట ఉండే వైరస్‍ల వల్ల అప్పుడే పుట్టిన బిడ్డకు ప్రమాదం రాకూడదనే కారణంతో పురిటిపాకను వారి సంస్కృతిలో భాగంగా నిర్మించుకుంటున్నారు. అందుకే నేడు ప్రపంచం మొత్తం కరోనాతో వణుకుతున్నా గిరిపల్లెలు మాత్రం ప్రశాంతంగాఅడవి తల్లి ఒడిలో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవనం సాగిస్తున్నాయి.