- గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల బలోపేతంపై శిక్షణ ప్రారంభం
- పాల్గొన్న కేంద్ర మంత్రి దుర్గదాస్ ఊకే, రాష్ట్ర మంత్రి లక్ష్మణ్
హైదరాబాద్ సిటీ, వెలుగు:గిరిజనుల్లో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునీకతతో కలపడం అవసరమని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం అభిప్రాయపడ్డారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల ‘కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ట్రైబల్ హీలర్స్ ఆన్ స్ట్రెంగ్తనింగ్ హెల్త్ అవుట్‌రీచ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్’ శిక్షణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ శివారు కన్హా శాంతి వనంలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి దుర్గదాస్ ఊకే, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జువల్ ఓరం ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్)కి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న సంప్రదాయ ఆరోగ్య హీలర్లు, వైద్య నిపుణులు పెద్ద సంఖ్యలో ఈ శిక్షణలో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. గిరిజనులకు సమగ్ర ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా హీలర్లు ఆధునిక వైద్య సాంకేతికతలు, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతులు, ఆరోగ్య అవగాహన వంటి అంశాలపై శిక్షణ పొందుతారని, తెలంగాణలో గిరిజనుల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
