
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు తీర్పు మేరకు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి కృతజ్ఞతగా గురువారం అభినందన సభ ఏర్పాటు చేయనున్నట్లు జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్స్ హౌసింగ్ సొసైటీ ఫౌండర్ పీవీ రమణారావు తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో గురువారం జరిగే సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు.
దశలవారిగా వీలును బట్టి మిగతా మంత్రులకు కూడా సన్మాన సభలు ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హైదరాబాద్ జర్నలిస్టులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలను జేఎన్‌జే మాక్స్ హౌసింగ్ సొసైటీకి స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును అమలు చేయకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును కాలరాసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటానికి అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న తమ ఇంటి స్థలాల సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు స్వాధీనం చేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సొసైటీకి కొత్త కమిటీని ఎన్నుకునే అంశంపై చర్చ జరగనున్నదని తెలిపారు.