
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను.. కానీ అప్పటికే విరాట్ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాడని అన్నారు. కోహ్లీకి ఇంకా కొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడగలిగి సత్తా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు బంగర్. కానీ కోహ్లీ తన నిర్ణయంపై నమ్మకంగా ఉన్నాడన్నారు. రిటైర్మెంట్ విషయంలో కోహ్లీ వెనక్కి తగ్గే అవకాశం లేదని.. అభిమానులు అతడి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు. అయితే.. కోహ్లీ రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం వ్యక్తిగతంగా తనకు విచారకరమైన రోజని అన్నారు. తన కాలంలో విరాట్ కోహ్లీ ఒక దిగ్గజమని.. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు.
ALSO READ | RR vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. రెండు మార్పులతో రాజస్థాన్
కాగా, టెస్టు క్రికెట్‌లో ఓ సువర్ణాధ్యాయం ముగిసిన విషయం తెలిసిందే. టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్, 14 ఏండ్లుగా ఈ ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న విరాట్ కోహ్లీ సైతం తన టీమ్‌మేట్ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం (మే 12) ప్రకటించాడు. ఈ నిర్ణయం అంత సులభం కాకపోయినా.. తీసుకోవడం తప్పలేదని చెప్పి అభిమానులను నిర్వేదానికి గురి చేశాడు. 36 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ ను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు కోహ్లీ. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించటం.. కోహ్లీ ఫ్యాన్స్ సహా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.