TMC నుంచి 20 మంది ఎంపీలు జంప్?: ఎన్డీయేకు మద్దతిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ

TMC నుంచి 20 మంది ఎంపీలు జంప్?: ఎన్డీయేకు మద్దతిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ

కోల్‌‌‌‌‌‌‌‌కతా/న్యూఢిల్లీ: తృణమూల్​ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ చీఫ్​ మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎంపీలు షాకిచ్చారు. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఎంసీ ప్రధాన విప్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్డీయేకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్‌‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. 

ఢిల్లీలోని బీజేపీ నేత ఇంట్లో సోమవారం వారంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్​సోమవారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

టీఎంసీ ప్రధాన విప్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్‌‌‌‌సభ సభ్యులు ఎన్డీయేకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇదివరకే అసెంబ్లీలోనూ టీఎంసీ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నేతగా సోవన్‌‌‌‌దేబ్ చటోపాధ్యాయ్‌‌‌‌ను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కానీ.. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది ఆ నిర్ణయాన్ని ధిక్కరించారు. 
బదులుగా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.

రహస్య సమావేశం
ఓవైపు, మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ మిత్రపక్షాలతో ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు జరుగుతున్న ప్రదేశానికి కేవలం కిలోమీటరు దూరంలోనే ఓ బీజేపీ నేత ఇంట్లో రెబెల్ ఎంపీలు సోమవారం సమావేశం అయినట్టు తెలిసింది. తమ భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించి, ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని  నిర్ణయించుకున్నారు. కాకోలీ ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ ‘‘నాతో పాటు దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి ఎన్డీయేకు మద్దతు ప్రకటిస్తున్నాం” అని తెలిపారు.

పార్టీని వీడకుండా కొత్త వ్యూహం
తిరుగుబాటు ఎంపీలు తక్షణమే టీఎంసీకి రాజీనామా చేయడం లేదా బీజేపీలో చేరడం వంటి నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నట్లు సమాచారం. బదులుగా పార్లమెంట్‌‌‌‌లో ప్రత్యేక గ్రూప్‌‌‌‌గా కొనసాగుతూ ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈ వ్యూహం వల్ల పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం (యాంటీ డిఫెక్షన్‌‌‌‌లా) నుంచి రక్షణ పొందవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం లోక్‌‌‌‌సభలో టీఎంసీకి 28 మంది సభ్యులు ఉన్నారు. బసీర్‌‌‌‌హాట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇస్తే, అది పార్టీ మొత్తం సభ్యుల్లో రెండొంతుల కంటే ఎక్కువ సంఖ్య అవుతుంది. దీంతో ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వారికి రక్షణ లభించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అవినీతి పెరిగిపోయింది
సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ.. పార్టీలో అవినీతి పెరిగిపోయిందని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అటు బెంగాల్ శాసనసభలోనూ సుమారు 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసినట్టు సమాచారం. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే రోజుల్లో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.