జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: ట్రిపుల్ ఆర్ బాధితులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: ట్రిపుల్ ఆర్ బాధితులు

యాదాద్రి, వెలుగు : జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని, 100కు పైగా నామినేషన్లు వేస్తామని ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ బాధిత రైతులు ప్రకటించారు. శుక్రవారం యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌ ఎదుట బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ మార్చాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

అందుకే జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించామని చెప్పారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ మార్పు విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఆలేరు, భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయంలో ఏకపక్షంగా రూపొందించిన అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చాక అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను మార్పించలేకపోతున్నారని విమర్శించారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌కు 40 కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ నిర్మించాలని ఉన్నా కొందరు తమ ప్రయోజనాల కోసం అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ రూపొందించారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ మార్పునకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ. జహంగీర్‌‌‌‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, కాబట్టుపల్లి అనురాధ, మాటూరు బాలరాజు, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొన్నారు.