తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ట్రిపుల్​ఆర్ ​సర్వే

 తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ట్రిపుల్​ఆర్ ​సర్వే

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్​సర్వే యాదాద్రి జిల్లా రాయగిరిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సర్వే కోసం పొలాల్లోకి పోలీసుల సాయంతో రెవెన్యూ స్టాఫ్​వెళ్లగా వారిని రైతులు అడ్డుకున్నారు. కొందరు రైతులు కలెక్టరేట్​ను ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి, మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. 

పోలీసుల రక్షణలో సర్వే

యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల రీజినల్​రింగ్​రోడ్డు కోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లోని 23 గ్రామాల నుంచి 1853.04 సేకరించాల్సి ఉంది. ఇందులో ఒక్క రాయగిరి నుంచే 70 మంది  రైతులకు చెందిన 266.14 ఎకరాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో వివిధ ప్రాజెక్టుల కోసం 145 ఎకరాలిచ్చిన రాయగిరి రైతులు..ఈసారి మాత్రం ఇచ్చేది లేదంటూ తిరగబడ్డారు. సర్వే జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఏ విధంగానైనా సర్వే జరిపి తీరాలని పట్టుదలకు పోయిన రెవెన్యూ ఆఫీసర్లు పోలీసుల సాయం కోరారు. దీంతో 8 టీముల రెవెన్యూ స్టాఫ్​కు 200 మంది పోలీసులను రక్షణగా వచ్చారు. వీరిని తీసుకొని భూముల్లోకి వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. ఒక రైతు కారుకు అడ్డంగా నిలబడి ‘నన్ను చంపిన తర్వాతే నా పొలంలోకి వెళ్లండి’ అని హెచ్చరించాడు. పొలాల్లో ఇలా అడ్డుపడుతున్న వారిని అరెస్ట్​ చేసి పీఎస్​లకు తరలించారు. మరోవైపు కొందరు రైతులు, మహిళా రైతులు కలెక్టరేట్​వైపునకు బయలుదేరారు. దీంతో కలెక్టరేట్​దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రైతులు రోడ్డుపైనే బైఠాయించారు. ఎంతకీ లేవకపోవడంతో ట్రాఫిక్​ను మళ్లించాల్సి వచ్చింది.  రైతులు.. సీఎం కేసీఆర్​, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని గెలిపించినందుకు తమకు తగిని శాస్తి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి తన భూములను కాపాడుకునేందుకు తమను పట్టించుకోలేదని విమర్శించారు. 

అదుపు తప్పిన పరిస్థితి

ఆందోళన కొనసాగుతున్న సమయంలో పరిస్థితి కొంత అదుపు తప్పింది. ఒక్కో నిరసనకారుడిని నలుగురైదుగురు పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసులకు, మహిళా రైతులకు తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. కొందరిని అరెస్ట్​ చేసి వాహనంలో తరలిస్తుండగా మరికొందరు మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం వరకు కొనసాగింది. అరెస్ట్​ చేసిన ఆందోళనకారులను  భువనగిరి, బొమ్మల రామారం, బీబీనగర్​ పోలీస్​స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన రైతులకు కాంగ్రెస్, బీజేపీ సంఘీభావం ప్రకటించాయి. పోలీస్​స్టేషన్లలో ఉన్న రైతులను డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి, బీసుకుంట్ల సత్యనారాయణ, ప్రమోద్​కుమార్, బీజేపీ నేత మాయ దశరథ, నర్ల నర్సింగరావు, చందా మహేందర్​గుప్తా పరామర్శించారు.