గవర్నర్ పదవి అంటే రబ్బర్ స్టాంప్ కాదు : నల్లు ఇంద్రసేనారెడ్డి

గవర్నర్ పదవి అంటే రబ్బర్ స్టాంప్ కాదు : నల్లు ఇంద్రసేనారెడ్డి

తుంగతుర్తి , వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా పనిచేయడమే గవర్నర్ బాధ్యత అని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని సిరి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్​ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ తాను ఈ ప్రాంత వాసిగా ఉన్నందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రాంత వాసులు తనపై చూపిస్తున్న ప్రేమను జీవితాంతం మర్చిపోలేనన్నారు. 

గవర్నర్ బాధ్యత అంటే కేవలం మంత్రి మండలి సిఫార్సులపై సంతకం పెట్టడం మాత్రమే కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ప్రజలను అనుసంధానం చేసేటటువంటి వ్యవస్థ అని అన్నారు. త్రిపురలో 60 శాతం పైగా అడవులుంటాయని, మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుందని చెప్పారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఉంటూ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. అంతకుముందు సిరి ఫంక్షన్ హాల్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, బీజేవైఎం రాష్ట్ర లీడర్లు సంకినేని వరుణ్ రావు, జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు కడియం రామచంద్రయ్య, రాష్ట్ర లీడర్లు సంకినేని రవీందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా పాల్గొన్నారు.