మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. దాదాపు 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత త్రివిక్రమ్ కెమెరా వెనుక మళ్లీ అడుగు పెట్టారు.
తాజాగా, నిర్మాత నాగవంశీ తమ సోషల్ మీడియాలో సెట్స్‌లో వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి ఒక్కరి అభిమాన కథానాయకుడు వెంకటేశ్‌తో చేతులు కలిపారు. 'ది ఓజీస్' (The OGs) ఎంటర్‌టైన్‌మెంట్ మళ్లీ పునరావృతం కానుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అంచనాలు అమాంతం పెరిగాయి.
పాత స్నేహం..
వెంకటేశ్, త్రివిక్రమ్‌ల కాంబోకు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. గతంలో సంచలన విజయాలు సాధించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అద్భుతమైన అనుబంధం ఉంది. వెంకటేశ్ సోలో హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ విజయం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కథానాయికలు ఎవరు?
త్రివిక్రమ్ చిత్రాలంటేనే హీరోయిన్లకు మంచి పాత్రలు ఉంటాయి. గతంలో ఆయన తీసిన సినిమాల్లాగే ఈ సినిమాలోనూ ఇద్దరు నాయికలకు అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పాత్రల కోసం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు త్రిష, నిధి అగర్వాల్‌తో పాటు, కన్నడ నటి రుక్మిణీ వసంత్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ఎంపికవుతారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వెంకటేశ్ వరుస ప్రాజెక్ట్‌లతో..
ఈ చిత్రంతో పాటు, వెంకటేశ్ మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో రానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే, బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ సిరీస్‌ను కొనసాగిస్తూ 'దృశ్యం - 3' తో మరోసారి థ్రిల్ పంచడానికి సిద్ధంగా ఉన్నారు. త్రివిక్రమ్-వెంకటేశ్ కాంబోలో రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్, వింటేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెరపైకి తీసుకురావడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి.
After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️
— Naga Vamsi (@vamsi84) October 8, 2025
The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬
Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P
