యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'దేవర'. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ తీర ప్రాంతాల కథాంశంతో తెరకెక్కించారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మిశ్రమ స్పందను అందుకున్న ఈ చిత్రం తొలి భాగం ముగింపులో సస్పెన్స్ ఉంచి.. సీక్వెల్‌కు అవకాశం కల్పించడంతో 'దేవర 2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వస్తున్న వార్తలు ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
'దేవర 2' ప్రాజెక్ట్ నిలిచిపోయిందా?
'దేవర' ఫ్రాంఛైజీ రెండో భాగం 'దేవర" పార్ట్ 2ను మేకర్స్ ప్రస్తుతానికి నిలిపివేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వార్త నిజమైతే, ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం దర్శకుడు కొరటాల శివ రాసిన కొత్త స్క్రిప్ట్ డ్రాఫ్ట్‌తో జూనియర్ ఎన్టీఆర్ సంతృప్తి చెందకపోవడమేనని తెలుస్తోంది. సీక్వెల్ అనేది సహజంగా కొనసాగినట్లు కాకుండా, బలవంతంగా కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలా అనిపించిందని ఎన్టీఆర్ భావించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ముందే క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్...
నిజానికి, 'దేవర 2' ఆగిపోయిందనే ప్రచారం కొత్తది కాదు. 'దేవర: పార్ట్ 1' విడుదలైన తర్వాత కూడా ఇలాంటి వార్తలు వినిపించాయి. కానీ, ఆ సమయంలో ఎన్టీఆర్ స్వయంగా స్పందించి, 'దేవర 2' కచ్చితంగా ఉంటుందని ప్రకటించారు. 'దేవర: పార్ట్ 1' విజయం సాధించిన సందర్భంగా, చిత్ర యూనిట్ కూడా పోస్టర్ విడుదల చేసి, సీక్వెల్ కోసం సిద్ధంగా ఉండాలని సందేశం ఇచ్చింది. "తుఫాను (HAVOC) తీరాన్ని తాకి ఏడాది అయ్యింది, ప్రతీ తీరాన్ని వణికించింది... ప్రపంచం గుర్తుంచుకునే పేరు #DEVARA. అది పురివిప్పిన భయమైనా, పంచుకున్న ప్రేమ అయినా, ఆ వీధులు ఎప్పటికీ మరచిపోవు. ఇప్పుడు #Devara2 కోసం సిద్ధంగా ఉండండి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ ప్రకటన తర్వాత కూడా మళ్లీ సీక్వెల్ ఆగిపోయిందనే వార్తలు రావడం చూస్తే.. స్క్రిప్ట్‌పై యూనిట్‌కు ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ బిజీ షెడ్యూల్ కూడా 'దేవర 2' వాయిదాకు, నిలిపివేతకు ఒక కారణంగా చెబుతున్నారు.
'దేవర: పార్ట్ 1' విశేషాలు
తీర గ్రామానికి అధిపతి అయిన 'దేవర', ఆయన కొడుకు 'వరద' పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సంగీతం అనిరుధ్ అందించారు.
ALSO READ : దారుణంగా ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్
మొత్తానికి, 'దేవర 2' ఆగిపోయిందనే వార్తలు ఎంతవరకు నిజం అనేది త్వరలో అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను నిరాశపరిచే కథతో ముందుకు వెళ్లడం కంటే, ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయడమే మేలు అని మేకర్స్ భావిస్తున్నారేమో చూడాలి.
