కరోనా కాటుతో కూలుతున్న కుటుంబాలు

కరోనా కాటుతో కూలుతున్న కుటుంబాలు

ఇంటి పెద్దను కోల్పోయి  ఆర్థిక చిక్కుల్లో అనేక ఫ్యామిలీలు
తల్లిదండ్రుల మృతితో అనాథలుగా వందలాది మంది చిన్నారులు
వేలాది కుటుంబాల్లో విషాదం ..దయనీయంగా మారిన బతుకులు

మెదక్​ జిల్లా శివ్వంపేటకు చెందిన కమలయ్యగారి నగేశ్(39)కు కరోనా సోకడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో జాయిన్ ​చేశారు. రూ.15 లక్షల అప్పు చేసి ట్రీట్​మెంట్​ చేయించారు. 20 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన నగేశ్​ ఇటీవలే చనిపోయారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే నగేశ్ ​మృతితో ఫ్యామిలీ పరిస్థితి దయనీయంగా మారింది. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లల చదువులు, వారి భవిష్యత్​ గురించి నగేశ్​ భార్య మనోవేదన చెందుతున్నారు.

వెలుగు, నెట్​వర్క్: కరోనా దెబ్బకు రాష్ట్రంలోని అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయిన కొన్ని వేల కుటుంబాల భవిష్యత్​ప్రశ్నార్థకంగా మారింది. ప్రాణనష్టంతోపాటు ఆయా కుటుంబాలు ఆర్థికంగానూ చితికిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఫ్యామిలీలు ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. స్టేట్​వైడ్​ఇలా అనాథలుగా మారిన పిల్లలు వందల్లో ఉన్నప్పటికీ వీరి విషయంలో కేసీఆర్​సర్కారు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
ఏపీ, తమిళనాడు ఆదర్శం 
కొవిడ్​ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 వరకు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి లేదా తండ్రి గతంలో వివిధ కారణాల వల్ల చనిపోయి, ఇప్పుడు మరొకరు కొవిడ్​తో మరణించడం వల్ల కూడా కొందరు పిల్లలు అనాథలయ్యారు. ఇలాంటి పిల్లల్లో చాలామంది అమ్మమ్మ, నానమ్మ ఇండ్లల్లో, బంధువుల ఇండ్లలో తలదాచుకున్నారు. ఈక్రమంలో అనాథ పిల్లల భవిష్యత్​ కోసం కేంద్ర సర్కారు తాజాగా పీఎం కేర్స్​నుంచి రూ.10 లక్షల కార్పస్ ఫండ్ అందజేయాలని నిర్ణయించింది. వారికి18 ఏండ్లు నిండినప్పటి నుంచి ఐదేళ్లపాటు నెలవారీ స్టైఫండ్, 23 ఏళ్లు నిండాక రూ.10  లక్షలు పీఎం -కేర్స్ నుంచి అందుతాయి. అనాథలను ఆదుకునే విషయంలో మన పొరుగున ఉన్న ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీరికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షలు ఫిక్స్ డ్​డిపాజిట్​చేస్తోంది. పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చేదాక డిపాజిట్​పై నెలనెలా 5 నుంచి 6 శాతం వడ్డీ అంటే కనీసం రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు​ సర్కారు, అనాథ పిల్లలకు రూ.5లక్షలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు రూ.3 లక్షల ఫిక్స్​డ్​డిపాజిట్​చేస్తోంది. చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం స్టాలిన్​ప్రటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి అనాథ చిన్నారుల భవిష్యత్​గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కేవలం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో హెల్ప్​లైన్​ ఏర్పాటుచేసి కుటుంబసభ్యులు చేరదీయని చిన్నారులను జిల్లాకేంద్రాల్లోని ట్రాన్సిట్​హోమ్స్​కు తరలించి చేతులు దులుపుకొంటున్నారు.

ఇవి నిజానికి కొవిడ్​ సోకిన కుటుంబాల్లోని చిన్నారులను సంరక్షించేందుకు ఏర్పాటుచేసిన సెంటర్లు. ఆ తర్వాత చిన్నారుల పరిస్థితి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఈ ట్రాన్సిట్​హోమ్స్​కోసం ఏర్పాటు చేసిన టోల్​ఫ్రీ నంబర్లకు అనాథల నుంచి 250 కి పైగా కాల్స్​ వచ్చాయని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీఎం కేర్స్​కార్పస్​ఫండ్​అమలు కోసమైనా కేసీఆర్​ సర్కారు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల గుర్తింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. 

నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం జామ్​గ్రామానికి చెందిన రాములు, భోజక్క వారం వ్యవధిలో కరోనాకు బలయ్యారు. వీరి ఇద్దరి కూతుళ్లు లత, సమత అనాథలయ్యారు. ఇందులో పెద్ద పాప లత మానసిక వికలాంగురాలు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన  వెల్డర్​చిలకల వెంకన్న ఏడాది కింద విద్యుత్ షాక్​తో చనిపోయారు. అతని భార్య ఇటీవల కరోనాతో చనిపోవడంతో వారి కూతురు నేహ(5), కుమారుడు వర్షిత్ అనాథలయ్యారు. భర్త వెంకన్న చనిపోవడంతో స్వప్న పిల్లలను సాదుకుంటోంది. ఆమెకు ఏప్రిల్ లో కరోనా సోకగా గాంధీలో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ ఈ నెల 21న మృతి చెందింది.

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం సాథ్నెంబర్​కు చెందిన రాఠోడ్ గౌరి కరోనాతో మృతి చెందడంతో ఆమె ముగ్గురు పిల్లలు చందన (12), వందన (10) , సిద్దు(7)  అనాథలయ్యారు. ఆమె భర్త ఇందర్​సింగ్​చాలాకాలం కిందట బ్లడ్ క్యాన్సర్​తో చనిపోయాడు. భర్త చనిపోవడంతో గౌరికి కోర్టులో అటెండర్​ఉద్యోగం వచ్చింది. బోధ్​ కోర్టులో పని చేస్తున్న ఆమెకు ఈ నెల 12న కరోనా సోకగా, రిమ్స్​లో ట్రీట్​మెంట్​పొందుతూ చనిపోయింది.  ప్రస్తుతం ముగ్గురు పిల్లలు నేరడిగొండ మండలం పట్పట్ తండాలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు.