
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం (సెప్టెంబర్ 12) తీరం దాటనుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలిపారు అధికారులు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు:
ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా అన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ALSO READ : గూగుల్ మ్యాప్ తో సముద్రం ఒడ్డున డ్రైవింగ్
హైదరాబాదీలకు హెచ్చరిక.. నగరంలో భారీ వర్షం కురిసే చాన్స్:
శుక్రవారం హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు వర్షంతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులతో పాటు జీహెచ్ఎంసీని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాలు :
తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం (సెప్టెంబర్ 11) ఒక్క రోజు రాత్రికే భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ములుగు జిల్లాలోని మల్లంపల్లి లో 21.7 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి లో 21.13 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో వాగులు వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పంటలు నీటమునిగాయి. ఆ తర్వాత వర్షపాత వివరాలు వరుసగా.. మెదక్ 19.85, కరీంనగర్ బోర్నపల్లి లో 19.78, రంగారెడ్డి జిల్లాలో 18, సిద్దిపేట 17.93, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక లో 17.65 వర్షపాతం నమోదయ్యింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షపాతం వివరాలు:
జీహెచ్ఎంసీ పరిధిలో హయత్ నగర్ లో 11.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. హయత్ నగర్ డిఫెన్స్ కాలనీ లో 10.43 , బండ్లగూడ లో 4.73, వనస్థలిపురం లో 4.68, సరూర్ నగర్ లో 4.3, కూకట్ పల్లి లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వివరాలు వెల్లడించింది.