గూగుల్ మ్యాప్ తో సముద్రం ఒడ్డున డ్రైవింగ్ : మద్యం మత్తులో అలల మధ్య ఇలా..

గూగుల్ మ్యాప్ తో సముద్రం ఒడ్డున డ్రైవింగ్ : మద్యం మత్తులో అలల మధ్య ఇలా..

తమిళనాడు రాష్ట్రంలో కలకలం. చెన్నై సిటీకి చెందిన నలుగురు యువకులు.. ఇద్దరు యువతులు. వీళ్లందరూ ఫ్రెండ్స్. కారులో జర్నీ చేస్తున్నారు. పార్టీ మూడ్ లో ఉన్నారు. మందు కొట్టారు. చెన్నై నుంచి వెళుతూ వెళుతూ సముద్రం తీరం వెంట కారు వెళుతుందని ఒకరు.. వెళ్లదని మరొకరు పందెం కట్టారు. అసలే మందు కొట్టి ఉన్నారు.. మాటా మాటా పెరిగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న యువకులు.. తీరం వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

గూగుల్ మ్యాప్ చూశారు. కడలూరు ఓడరేవు నుంచి పరంగిపెట్టై వరకు సముద్రం ఒడ్డు మీదుగా వెళ్లొచ్చని.. గూగుల్ మ్యాప్ చూపిస్తుందని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా కడలూరు ఓడరేవు నుంచి పరంగిపెట్టై వరకు సముద్రం ఒడ్డు మీదుగా వెళ్లాలంటూ.. జాతీయ రహదారి దిగి సముద్రం తీరానికి వచ్చారు. అనుకున్నట్లుగానే కడలూరు ఓడరేవు నుంచి జర్నీ చేస్తూ ఉండగా.. సరిగ్గా సోథికుప్పం ప్రాంతానికి రాగాలనే మద్యం మత్తులో ఉన్న యువకుడు.. కారు సముద్రంలోకి తీసుకెళ్లాడు. అలా వెళ్లిన వెంటనే సముద్రం అలల మధ్య.. కారు కూరుకుపోయింది. అలల తీవ్రత కూడా ఉంది. 

ALSO READ : తిరుమల హుండీ దొంగను పట్టుకున్నారు...

ఈ విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించారు. కొందరు మత్స్యకార యువకులు వెంటనే సముద్రంలోకి దిగి.. కారులోని ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇసుకలో కారు కూరుకుపోవటంతో.. ట్రాక్టర్ల సాయంతో దాన్ని బయటకు తీశారు. 2025, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

కారు ప్రమాదం జరిగిన చోట మత్స్యకార గ్రామం ఉండటం.. మత్స్యకారులు సముద్రం ఒడ్డునే ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. గూగుల్ మ్యాప్ లో దారి చూపిస్తుందని.. అందుకే సముద్రం ఒడ్డున వెళ్లాలని అనుకున్నామంటూ ఆ యువకులు చెప్పటం విశేషం.