తప్పుడు సాక్ష్యం చెప్పాలని వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం

తప్పుడు సాక్ష్యం చెప్పాలని వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం
  • కెనాల్​లో దూకడంతో  కాపాడిన స్థానికులు

హనుమకొండ, వెలుగు: 'మేం చెప్పినట్టు స్టేషన్​ లో సాక్ష్యం చెబితే విజయ్​భాస్కర్​ అన్న, వినయ్​భాస్కర్​ అన్నతో చెప్పి దళితబంధు ఇప్పిస్తం. రూ.5 లక్షలు కూడా ఇచ్చేలా చేస్తం. ఒకవేళ నువ్వు వినకపోతే నిన్ను, నీ భార్యను చంపేస్తం' అని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ హనుమకొండ గొల్లపల్లి ఇందిరానగర్​కు చెందిన టీఆర్ఎస్​ కార్యకర్త రౌతు రాంబాబు సూసైడ్​ అటెంప్ట్ చేశాడు. గొల్లపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ లో దూకగా.. స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. బాధితుడు మాట్లాడుతూ ఈ నెల 25న హనుమకొండ ఏనుగులగడ్డకు చెందిన బొక్క రాజు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చారని, తనతో పాటు తన  భార్యను కులం పేరుతో బూతులు తిడుతూ దాడి చేశారని ఆరోపించాడు.

కొంతమంది పేర్లు చెప్పి, వాళ్లంతా బొక్క రాజును చంపేందుకు ఇంటిపై దాడి చేశారని సాక్ష్యం చెప్పాల్సిందిగా ఒత్తిడి చేశారని, లేదంటే తనతో పాటు తన భార్యను కిడ్నాప్​ చేసి చంపేస్తామని బెదిరించారన్నాడు. పోలీస్ స్టేషన్​కు వచ్చి సాక్ష్యం చెప్తే ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​, ఆయన సోదరుడు విజయ్​భాస్కర్​తో చెప్పి దళితబంధుతో పాటు రూ.5 లక్షల నగదు ఇప్పిస్తానని ఆశ చూపారన్నారు. తాము తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకోకపోవడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. తర్వాత హనుమకొండ పీఎస్​లో కంప్లయింట్​ చేశాడు. బొక్కరాజు, నేపాల్​ రెడ్డితో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.