హైదరాబాద్ : విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిలైందని శాసనమండలిలో సభ్యులు అన్నారు. మంగళవారం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కేంద్రం వైఫల్యం, ఎఫ్‌ఆర్‌బీఎం అంశాలపై షార్ట్ డిస్కషన్ జరిగింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి ఏమీ రాలేదన్నారు. ఐటీఐఆర్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం తదితర హామీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. ఇవేవీ చేయక పోగా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపి అన్యాయంగా వ్యవహరించారన్నారు.
కిషన్‌రెడ్డి చేసిందేం లేదు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి గల్లీదాక రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప ఒరగబెట్టింది ఏం లేదన్నారు. వారికి రాష్ట్రంపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, ఇన్‌స్టిట్యూట్‌లు తేవాలన్నారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా తేకుండా చౌకబారు సన్నాసుల్లా విమర్శలుచేస్తున్నారన్నారు. పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా చట్టం ఉల్లంఘించిందని బండ ప్రకాశ్ విమర్శించారు. నేటికీ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగలేదన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు
ఉద్యమ నాయకుడే సీఎంగా ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటు తలుపులు మూసీ తెలంగాణ ఇచ్చారని ప్రధాని ఎలా అంటారని ప్రశ్నించారు. బీజేపీకి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందా అని నిలదీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్రం అభివృద్ధిని అడ్డుకుంటోంది
రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం లేదని, ఎఫ్‌ఆర్‌బీఎం 0.5 శాతం తగ్గించారని ఫలితంగా రూ.6,104 కోట్లు నష్టపోయామని చెప్పారు. టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎంఐఎం సభ్యుడు మీర్జా ఎఫెండీ తదితరులు మాట్లాడారు.
రెండు తీర్మానాలకు ఆమోదం
కొత్తగా పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రతిపాదిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మంత్రి జగదీశ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. కౌన్సిల్ సభ్యులు ఈ రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
