కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం మైండ్ గేమ్ ఆడుతోంది. ముందుగా ఈటలను బర్తరఫ్ చేసిన హైకమాండ్ అనంతరం ఆయనను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈటల వెనక ఉన్న నేతలను టార్గెట్ చేశారు. మాట విననివారిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని అధికారులను సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని ప్రకటనలు చేయిస్తూ.. లెటర్లు రాయించుకుంటోంది. తాజాగా టీఆర్ఎస్వీ నుంచి ప్రెస్ మీట్ నిర్వహించి ఈటలకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏదో రకంగా ఈటలను నియోజకవర్గంలో ఒంటరిని చేసి.. బై ఎలక్షన్లు తెచ్చి.. ఎట్లైనా ఓడించాలనే స్కెచ్ వేస్తున్నారు. అధిష్టానం నుంచి వస్తున్న డైరెక్షన్లను లోకల్ మంత్రి గంగుల అమలు చేస్తున్నారు.
ఈటల అనుచరులపై ఒత్తిడి
అసైన్డు భూముల వివాదంలో ఈటల రాజేందర్ ను రెండు వారాల కిందట మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. అయితే ఈటల పార్టీ నుంచి బయటికి రాలేదు. తనను ఎన్నుకున్న నియోజకవర్గంలోని నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక్కడే రెండు రోజులు ఉన్నా.. ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి హైదరాబాద్ లోనే నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కు వెళ్లిన నాటి నుంచే ఈటల అనుచరులు.. వర్గం మీద అధిష్టానం ఎక్కడ లేని ఒత్తిడి తీసుకువస్తోంది. ఆ నాలుగు రోజులు ఈటల వెంట ఉన్న నియోజకవర్గ నాయకులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరునాడే కొందరికి పాత కేసులకు సంబంధించి నోటీసులు కూడా అందించారు. ఈటలతో ఇక్కడి నాయకులు ఎవరూ టచ్ లో ఉండొద్దని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు అంతా ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో మాట్లాడినపుడు తామంతా ఈటల వెంటే ఉంటామని చెప్పారు. కానీ మరుసటి రోజు నుంచే ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడైతే నియోజకవర్గంలోని కీలక నేతలంతా తాము కేసీఆర్ వెంటే ఉన్నామని పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు.
చక్రం తిప్పుతున్న గంగుల
ఈటలను మంత్రివర్గం నుంచి పక్కన పెట్టడంతో హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాల్లో మంత్రి గంగుల కమలాకర్ ఎంటర్ అయ్యారు. తానే అన్ని అయి అందరు నాయకులతో మాట్లాడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. దశలవారీగా హుజురాబాద్, జమ్మికుంట నాయకులతో తన క్యాంపు ఆఫీస్ లో మీటింగ్ లు నిర్వహిస్తూ వారికి డైరెక్షన్లు ఇస్తున్నారు. వారం నుంచి హుజురాబాద్, జమ్మికుంటకు చెందిన కీలక నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన ఈటల ఇప్పుడు పార్టీని విమర్శిస్తున్నారని.. మనమంతా కేసీఆర్ వెంటే ఉండాలని వారికి చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి.. తాము కేసీఆర్ వెంటే ఉన్నామని ప్రకటనలు జారీ చేయాలని హుకుం సైతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్లకు రాని నాయకుల పేర్లు సైతం ఇవ్వాలని, వారి రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటదో చూస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హుజురాబాద్, జమ్మికుంట కీలక నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో మీటింగ్స్ పూర్తయ్యాయి. జమ్మికుంట కు చెందిన మున్సిపల్ చైర్మన్ ఈటల బర్తరఫ్ తరవాత ఆయన నివాసంలో.. ఆ తరువాత హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో వెంటే ఉన్నారు. అధిష్టానం నుంచి ఏం సంకేతాలు వెళ్లాయో కానీ.. శుక్రవారం మాత్రం ఒక వీడియో తీసి ప్రెస్ కు రిలీజ్ చేశారు. తాను కేసీఆర్ వెంటే ఉంటానని.. పార్టీయే ముఖ్యమని పేర్కొన్నారు. దీనికి తోడు నిన్నా.. మొన్న హుజురాబాద్, జమ్మికుంట కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు.. చైర్మన్లు ప్రెస్ మీట్లు నిర్వహించి తామంతా కేసీఆర్ వెంటనే నడుస్తామని.. అధిష్టానం మాట జవదాటమని చెప్పారు. ఈటల ప్రధాన అనుచరురాలిగా ఉన్న కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్కనుమల్ల విజయం శనివారం ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ఆశీస్సులతోనే తాను జడ్పీ చైర్పర్సన్ అయ్యానని, కేసీఆర్‌ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
రాజీనామాకు డిమాండ్
హుజురాబాద్ లో శనివారం టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ వై విభాగాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆత్మగౌరవం అని చెప్పే ఈటల కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినా ఎందుకు రాజీనామా చేయడానికి వెనుకాడుతున్నారని వారు ప్రశ్నించారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్‌చేశారు. నియోజకవర్గంలోని స్టూడెంట్, యువజన విభాగం అంతా టీఆర్ఎస్ వెంటే ఉందని చెప్పారు. వీరి వెనక టీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. ఆయనది హుజురాబాద్ నియోజకవర్గం కావడం విశేషం. ఈయన గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా కుదరలేదు. ఇదే అదనుగా భావించి యూత్ వింగ్ ను ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది.
అధికారులను సైతం..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉన్న వారందరిని ఆయనకు దూరం చేయాలని అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఏసీపీగా ఉన్న సుందరగిరి శ్రీనివాస్ ను బదిలీ చేసి డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఆర్డీవోను సైతం బదిలీ చేశారు. వీరితో పాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సీఐలను సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇలా ఏదో రకంగా నియోజకవర్గంలో ఈటలను ఒంటరిని చేయాలని శాయశక్తులా పని చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా అధికారులను పెద్దఎత్తున బదిలీలు చేయడం.. నాయకులను సైతం వారి వైపు తిప్పుకుంటూ ఈటలను ఏకాకి చేస్తున్నారు.
