
ఐదు మున్సిపాటిల్లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఏ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ దాటలేదు. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ బై పోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దూకుడు కొనసాగింది. ఐదు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. సిద్ధిపేటలో 43 వార్డులకు టీఆర్ఎస్ 36 గెలిచింది. బీజేపీ ఒకటి, MIM ఒక్క వార్డులో విజయం సాధించింది. మరో ఐదు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 20వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి రియాజ్.. మంత్రి హరీశ్ సమక్షంలో TRSలో చేరారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీఆర్ఎస్. మొత్తం 20 వార్డులకు టీఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2 చోట్ల గెలవగా.. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఆరుగురు విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్-7, కాంగ్రెస్-5 స్థానాల్లో గెలుపొందాయి. 2, 3, 7, 8, 10, 11,12 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1, 4, 5,6,9 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులను అభినందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధి పనులు చేయడంతో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోనూ విజయం టీఆర్ఎస్ కే దక్కింది. 27 వార్డులకు టీఆర్ఎస్ 24, బీజేపీ రెండు, కాంగ్రెస్ అభ్యర్థులు ఒక స్థానంలో గెలిచారు. 27వ వార్డులో కాంగ్రెస్, 10,16 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ తరపున గెలిచిన అభ్యర్థుల్ని అభినందించారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. 20 వార్డుల్లో 13 వార్డులు టీఆర్ఎస్ కు దక్కాయి. కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒకస్థానంలో గెలిచింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సొంత వార్డులో.. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. హైదరాబాద్ లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేశ్.. ప్రమాణం చేయకుండానే చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. లింగోజీగూడలో 13 వేల 629 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డికి 7వేల 240 వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అఖిల్ గౌడ్ కు 5వేల 968 ఓట్లు దక్కాయి. లింగోజీగూడలో గెలుపుతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలం మూడుకు పెరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలోని 18వ వార్డు, గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డు ఉప ఎన్నికలలోనూ టీఆర్ఎస్ గెలిచింది.