
దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో సోమవారం టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు కొట్టుకున్నారు. రెండు వర్గాలు నడిరోడ్డుపై కలబడడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగినప్పటికీ పరస్పరం కేసులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల మండలంలోని పాత మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు. రూ.22 లక్షలతో మంజూరైన డైనింగ్ హాల్నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ విషయంలో లొల్లి జరిగింది. అప్పటినుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఆదివారం సాయంత్రం ఇదే విషయంలో రెండు పార్టీల లీడర్లు మేదరిపేట బస్టాప్ వద్ద బాహాబాహీకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో జడ్పీటీసీ నాగమణి భర్త కాంగ్రెస్ లీడర్గడ్డం త్రిమూర్తితో పాటు పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ టీడర్లు గాయపడ్డారు. టీఆర్ఎస్ లీడర్ పత్తిపాక శ్రీనివాస్ భార్య శ్రీలేఖ ఫిర్యాదుతో కాంగ్రెస్ లీడర్లు గడ్డం త్రిమూర్తి, కొట్ల మహేందర్, బత్తుల రమేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. కాగా కొట్ల మహేందర్ భార్య టీఆర్ఎస్ లీడర్లపై కంప్లయింట్ఇచ్చినట్టు తెలిసింది.