కాంగ్రెస్ లో చేరనున్న టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయా రెడ్డి

కాంగ్రెస్ లో చేరనున్న టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయా రెడ్డి

మొదట్నుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్న పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయా రెడ్డి  తాజాగా అందరికీ షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ సీటు దక్కకపోవడంపై అప్పట్లో విజయ తీవ్ర నిరాశకు లోనయ్యారు. మేయర్ ఎన్నిక రోజు కూడా ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంత్రి తలసాని బుజ్జగించడంతో మళ్లీ ఆమె తిరిగి రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పట్నుంచి తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు విజయ ఎంతగానో ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆమె...త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ కమిట్మెంట్ తోనే విజయా రెడ్డి కాంగ్రెస్ లో చేరనునట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నానని విజయా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. తన నాన్న పీజేఆర్.... కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ దాకా ఎదిగారని.. తాను కూడా కాంగ్రెస్ లోనే చేరాలని నిర్ణయం తీసుకున్నానని విజయా రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశానన్న ఆమె... త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నానని ఈ సందర్భంగా తెలిపారు. గాంధీ ఫ్యామిలీతో తమ కుటుంబానికి అనుబంధం వుందని.. తన రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్ తోనే ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులతో , అనుచరులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. పీజేఆర్ చనిపోయాక తనకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్లు ఎవరు లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అన్న ఆమె... ఎంతమంది లీడర్ లనైనా తయారు చేయవచ్చునని తెలిపారు. ప్రాంతీయ పార్టీలలో అలాంటి అవకాశంఉండదని విజయా రెడ్డి స్పష్టం చేశారు.