
టీఆర్ఎస్ నేతలకు రైతుల నుంచి నిరసన ఎదురైంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దేవన్న పేటలో చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 29న నిర్వహించతలపెట్టిన ‘విజయగర్జన సభ’ కోసం స్థల పరిశీలనకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. సభ పెట్టాలనుకున్న స్థలంలో పంటలు కోత దశలో ఉన్నాయి. దాంతో రైతులు తమ పోలాలను సభ కోసం ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. పంటలు ఇప్పుడే కోత దశకు వస్తున్నాయని.. సభ కోసం పంట భూములు ఎలా ఇస్తామంటూ టీఆర్ఎస్ నేతలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థల పరిశీలనకు వెళ్లిన కడియం శ్రీహరి, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్ లను రైతులు అడ్డుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని.. అదంతా అబద్ధమని రైతలు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడొచ్చి హామీలిచ్చి వెళ్లిపోతారని.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని వాపోయారు. ఎవరేం చెప్పినా... భూములు ఇచ్చేది లేదని రైతలు స్పష్టంచేశారు. భూములు ఇచ్చేదిలేదని రైతులు వాగ్వాదానికి దిగడంతో.. టీఆర్ఎస్ కార్పొరేటర్ రాజునాయక్, ఆయన అనుచరులు రైతులపై దాడి చేశారు.