
కూకట్పల్లి, వెలుగు : బాలాజీ నగర్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరీశ్‌రెడ్డి దంపతులు బీజేపీలో చేరనున్నారు. ఈనెల 15వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మన్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో వారు పార్టీలో చేరుతారని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు, కూకట్పల్లి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ రవికుమార్‌గౌడ్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 15న సాయంత్రం 4.30 గంటలకు ఎన్ గార్డెన్స్ లో జరిగే పార్టీ సమావేశంలో వారితో పాటు 2 వేల మంది బీజేపీలో చేరుతారని చెప్పారు.
గతంలోనూ బీజేపీలో చురుకుగా..
కార్పొరేటర్ కావ్య ఆమె భర్త హరీశ్రెడ్డిలకు గతంలో బీజేపీతో అనుబంధం ఉంది. నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు చెందిన హరీశ్‌రెడ్డికి ఏబీవీపీ నేతగా గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా మెలిగారు. కూకట్‌పల్లిలో స్థిరపడ్డాక కూకట్పల్లి మున్సిపాలిటీలో టీడీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. కూకట్పల్లి మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో కలిసిన తర్వాత రెండు సార్లు కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు. తదుపరి కాంగ్రెస్‌లో ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన భార్య కావ్యను బాలాజీనగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయికి హరీశ్‌రెడ్డి ఎదగడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో రాజకీయ వైరం పెరిగింది. కూకట్పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టీఆర్ఎస్ పార్టీ సీటు ఇవ్వడంతో హరీశ్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేశారు. కొన్ని నెలల పాటు సైలెన్స్‌గా ఉన్న హరీశ్‌రెడ్డి కార్పొరేటర్ అయిన తన భార్య కావ్యతో పాటు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.