తిరగబడుతున్న కౌన్సిలర్లు.. పురపాలికల్లో సీన్ రివర్స్

తిరగబడుతున్న కౌన్సిలర్లు.. పురపాలికల్లో సీన్ రివర్స్

రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వాటిలో 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడక్కడ కాంగ్రెస్, బీజేపీ లు పాగా వేయగలిగాయి. దీంతో నాలుగేళ్ళ వరకు మేయర్ లపై, మున్సిపల్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి.. చట్టాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది.. కొందరు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లు పార్టీ మారినా వారిపై వేటు వేసే అవకాశం లేకుండా పోయింది. చాలా మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల మధ్య వివాదాలున్నా..  టీఆర్ఎస్ ముఖ్యనేతలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నల్లగొండ మున్సిపాలిటీలో 14 మంది ఎదురుతిరిగారు

రీసెంట్ గా నల్లగొండ మున్సిపాలిటీలో 14 మంది టీఆర్ఎస్  కౌన్సిలర్లు ఎదురుతిరిగారు. కౌన్సిల్ మీటింగ్ ను టీఆర్ఎస్ సభ్యులే బహిష్కరించారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు ఒక్కటైనట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా వారిని పిలిచి మాట్లాడకపోవడానికి వేరే కారణం ఉందంటున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ తో ఉన్న గ్యాప్ కారణంగానే వారిని పిలిచి మాట్లాడలేదంటున్నారు. తమను మున్సిపల్ చైర్మన్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు నల్లగొండ కౌన్సిలర్లు. వార్డుల్లో ఏ పని చేయాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నా ఎమ్మెల్యే దగ్గరికే వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ఎమ్మెల్యే కూడా తమను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కాంట్రాక్టులు ఎమ్మెల్యే బంధువులకు, అపోజిషన్  పార్టీలో ఉన్నోళ్లకు ఇచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో దీనిపై ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే తమనే బెదిరించారని కౌన్సిలర్లు అంటున్నారు. 

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్సెస్ మంత్రి జగదీశ్ రెడ్డి 

కోదాడ మున్సిపాలిటీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్సెస్ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నట్టుగా విడిపోయింది. మున్సిపల్ చైర్మన్ కవితా రెడ్డితో పాటు .. మొత్తం 25 మంది కౌన్సిలర్లలో  20 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే  వెంట ఉన్నారు. ఐదుగురు కౌన్సిలర్లు మంత్రి జగదీశ్ రెడ్డి వెంట ఉన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అమెరికా వెళ్లిన టైంలో మున్సిపల్ మీటింగ్ నిర్వహించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నించారు. బొల్లం వర్గం కౌన్సిలర్లు డుమ్మా కొట్టడంతో 6 మంది కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ కౌన్సిలర్ల సాయంతో కోరం కూర్చి మీటింగ్ నిర్వహించి మంత్రి జగదీశ్ రెడ్డి బలప్రదర్శన చేశారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏకపక్ష విధానాలతో..

మంచిర్యాల జిల్లాలోనూ టీఆర్ఎస్ లో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. ఆమె మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓదెలుకు పదవి ఇవ్వకుండా ఆయన భార్య భాగ్యలక్ష్మిని చైర్ పర్సన్ గా నియమించారు. అయితే.. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏకపక్ష విధానాలతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని స్థానికంగా వినిపిస్తున్న టాక్. సుమన్ పై పార్టీ పెద్దలకు ఫిర్యాదు  చేసినా ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదంటున్నారు. ఇక చేసేది లేక.. పార్టీ మారినట్టు ఆమె చెప్పారు. 

మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోనూ..

మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోనూ టీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన సమావేశాన్ని ముగ్గురు కౌన్సిలర్లు బహిష్కరించారు. జులై 29న క్యాతన్ పల్లి మున్సిపల్ సమావేశం జరిగింది. తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు ఫండ్స్ కేటాయించడం లేదంటూ 7,8,9 వార్డుల కౌన్సిలర్లు పోలం సత్యం, అల్గుల శ్రీలత, పారిపెల్లి తిరుపతి.. మున్సిపల్ మీటింగ్ బహిష్కరించారు. వారితో అంతకుముందే చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నాగరాజు, ఏఈ అచ్యుత్ చర్చించినా వినలేదు. ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అల్గుల శ్రీలత సమావేశానికి రాకుండానే వెళ్లిపోయారు. 7,9 వార్డు కౌన్సిలర్లు సత్యం, తిరుపతి మీటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు చెప్పివెళ్లిపోయారు. సమావేశం జరుగుతున్న టైంలో మూడో వార్డు కౌన్సిలర్ కొక్కుల స్రవంతి కూడా నిరసన తెలిపారు. తమకు మీటింగ్ లపై సమాచారం ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై ఆమె భర్త సత్యనారాయణ మీటింగ్ హాలు బయట గొడవ చేశారు. 

సొంత పార్టీ నేతల్లోనే ఆధిపత్య పోరు 

ఆదిలాబాద్ జిల్లా లోకల్ బాడీల్లో అసంతృప్తి కనిపిస్తోంది. బోథ్‌ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్లోనే ఆధిపత్య పోరు స్పష్టంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు, రాష్ట్ర డెయిరీ మాజీ ఛైర్మన్‌ లోకభూమారెడ్డి ఓ వర్గంగా మారారు.  బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ తో కలిపి మాజీ ఎంపీ గోడం నగేష్‌ మరో వర్గంగా కొనసాగుతున్నారు. బోథ్‌ లో ఉపాధి హామీలో అక్రమాల ఇష్యూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కుదిపేసింది. కొత్త మండలాల ఏర్పాటులో సొనాల ప్రస్తావన లేకపోవడంతో బోథ్ టీఆర్ఎస్ లో అసంతృప్తి మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరువల్లే మండలం ఏర్పాటు కాలేదని.. టీఆర్ఎస్ కే చెందిన ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆరోపించారు. ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఇదే టైంలో తుల శ్రీనివాస్‌ తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే బాపురావు అనుచరుడైన నేరడిగొండకు చెందిన బోథ్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దావుల భోజన్న బోథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జడ్పీ చైర్మన్ కూడా టికెట్ రేసులో ఉండటంతో..

ఖానాపూర్‌ లో ఎమ్మెల్యే రేఖానాయక్‌, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ వర్గాల మధ్య చాలా కాలంగా గ్యాప్ ఉందంటున్నారు. జడ్పీ చైర్మన్ కూడా టికెట్ రేసులో ఉండటంతోనే ఇక్కడ దూరం పెరిగిందని.. అది అభివృద్ధిపైనా ఎఫెక్ట్ చూపిస్తోందని స్థానిక నేతలంటున్నారు. నిర్మల్‌ జిల్లా పెంబి ఎంపీపీ కవిత భర్త గోవింద్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్‌ మధ్య ఇటీవలే పెంబిలో గొడవ జరిగింది. నిర్మల్  మున్సిపాలిటీలోనూ పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. చైర్మన్ కు సభ్యులకు మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. దీంతో ఎవరికి వారే అన్నట్టుగా నడుస్తోందనే మాట వినిపిస్తోంది. 

27 మంది కౌన్సిలర్లు వ్యతిరేకం అయ్యారు

చాలా మున్సిపాలిటీల్లో , కార్పొరేషన్లలో సొంత పార్టీలోనే గొడవలు ముదురుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల మున్సిపాలిటీల్లో కూడా వివాదాలు ముదిరి రోడ్డున పడ్డాయి. మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి కి మిగతా 27 మంది కౌన్సిలర్లు వ్యతిరేకం అయ్యారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని.. కొందరు డబ్బులు వసూలుచేశారనే ఆరోపణలు వివాదానికి కారణమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ భర్త పెత్తనం చలాయించటం.. ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం గతంలోనే మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్లింది. వారిని కేటీఆర్ పిలిచి మాట్లాడినా పరిస్థితి చక్కబడినట్టుగా కనిపించడం లేదని స్థానికంగా వినిపిస్తున్న టాక్. ః

వికారాబాద్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వార్ 

జిల్లాల్లోనే కాదు.. సిటీ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ కు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యనేతల మానిటరింగ్ ఉంటే అర్బన్ ఏరియాల్లోనూ వివాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వార్ నడుస్తోంది. తాండూరు మున్సిపాలిటీ విషయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య గొడవ జరుగుతోంది. రెండున్నరేళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడే తాండూర్ మున్సిపల్ చైర్మన్ పదవి విషయం ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఇద్దరి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ తర్వాత చైర్మన్ సీటు విషయంలో ఇద్దరి మధ్య ఓ అగ్రిమెంట్ కుదిరింది. 

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎదురుతిరగడంతో..

ఐదేళ్ల చైర్మన్ సీటును రెండు వర్గాలు చెరో సగం అంటే రెండున్నరేళ్ల చొప్పున పంచుకున్నాయి. దీనికోసం బాండ్ పేపర్ కూడా రాసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన తాటికొండ స్వప్నకు పదవి దక్కింది. ఇప్పుడు ఆమె రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది. గతంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే వర్గానికి చెందిన పటోళ్ల గీతకు పదవి ఇవ్వాలి. కానీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎదురుతిరగడంతో రెండు వర్గాల మధ్య వార్ పీక్స్ కు చేరింది. మహేందర్ రెడ్డి, భార్య సునీతను మెతుకు ఆనంద్ వర్గీయులు అడ్డుకున్నారు. 

 మదన్‌మోహన్‌ బీజేపీలో చేరడంతో..

పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. ఎలాగోలా మున్సిపాలిటీలు చేజిక్కించుకున్నా ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పుడు కారెక్కొనోళ్లు ఇప్పుడు గుడ్ బై చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్, తాజాగా బడంగ్‌ పేట కార్పొరేషన్ మేయర్‌ గులాబీకి గుడ్‌ బై  చెప్పారు. బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌ గా గెలిచిన మదన్‌మోహన్‌ కు తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఇచ్చింది టీఆర్ఎస్. అలాగే బడంగ్‌పేటలో పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కార్పొరేటర్‌ గా  గెలిచారు. ఆమెను, ఆమె మద్దతుదారులను టీఆర్ఎస్ లో కి ఆహ్వానించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పారిజాత నర్సింహారెడ్డికి మేయర్ పదవి ఇచ్చారు. అయితే ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతలతో కొత్తగా వచ్చినవారికి పొసగకపోవడంతో.. తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌ బీజేపీలో చేరారు. ఈ మధ్యే బడంగ్‌ పేట మేయర్, మరో నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  అలాగే మీర్‌పేట నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా కొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ ఇంటర్నల్ వార్ 

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ ఇంటర్నల్ వార్ పెరిగిపోయిందంటున్నారు. కౌన్సిలర్లు,  చైర్‌ పర్సన్‌ గ్రూపులుగా విడిపోయారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వచ్చినా.. ఆ పార్టీని చీల్చి.. కొత్త హరితకు చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చింది టీఆర్ఎస్. అయితే.. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డితో విభేదాలతో.. ఆమె కాంగ్రెస్ లో చేరారు.