చెరువులు, స్కూల్ స్థలాలను మంత్రి వదలడం లేదు

చెరువులు, స్కూల్ స్థలాలను మంత్రి వదలడం లేదు

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు, స్కూల్ స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. మీర్పేట్ ప్రాంతాన్ని సబిత నాశనం చేస్తున్నారంటూ మంత్రాల చెరువును పరిశీలించిన సందర్భంగా తీగల ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచెయ్యలేదన్నారు. మంత్రి అరాచకాలపై చూస్తూ ఊరుకోనని..అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని తీగల కృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని..సీఎంతో మాట్లాడతానని చెప్పారు. కాగా మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ లో విభేధాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న బడంగ్ పేట్ టీఆర్ఎస్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇక తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేనే మంత్రిపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక గత కొంతకాలంగా మంత్రి తీరుపై తీగల అసంతృప్తితో ఉన్నారు.

మళ్లీ మే రోడ్లపైకి వెళ్లే పరిస్థితి వచ్చింది

‘‘కొంతకాలంగా చెరువు స్థలంలో షాపింగ్ మాల్ కడతారనే ప్రచారం జరుగుతున్నది. గత కొన్నేళ్లుగా దీనిని మేము డీసీఎంల అడ్డాగా మార్చుకున్నాం. రోడ్లపై పెడితే ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టడంతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మా కోసం ఒక షెడ్డు నిర్మించి ఇచ్చారు. కానీ ఇక్కడ షాపింగ్ మాల్ కడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో మేం కూర్చునే దిమ్మెను కూల్చివేయించారు. ఇప్పుడు మేము డీసీఎంలు పెట్టుకోవడానికి అడ్డాలేకుండా పోయింది..మళ్లీ మేము రోడ్లపైకి వెళ్లే పరిస్థితి వచ్చింది’’ అని స్థానిక డీసీఎం డ్రైవర్ తెలిపారు.