మంత్రిపై కంప్లైంట్ చేసిన కౌన్సిలర్​ను బహిష్కరించిన టీఆర్‌‌ఎస్

మంత్రిపై కంప్లైంట్ చేసిన కౌన్సిలర్​ను బహిష్కరించిన టీఆర్‌‌ఎస్
  • గంటల్లోనే కౌన్సిలర్​ను బహిష్కరించిన టీఆర్‌‌ఎస్
  • సర్కార్ భూమి కబ్జా చేశాడని కేసు
  • శ్రీనివాస్​ గౌడ్ ​నుంచి ప్రాణహాని ఉందని హెచ్​ఆర్సీలో మహబూబ్‌నగర్ నేత ఫిర్యాదు

మహబూబ్​నగర్, వెలుగు: మంత్రితో ప్రాణహాని ఉందని హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేసిన టీఆర్​ఎస్ పార్టీ కౌన్సిలర్​పై గంటల్లోనే చర్యలు స్టార్ట్ అయ్యాయి. పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు.. తక్షణం రంగంలోకి దిగిన రెవెన్యూ ఆఫీసర్లు మున్సిపాల్టిలో భూ ఆక్రమణలపై ఎంక్వైరీ చేసి కౌన్సిలర్ భూ కబ్జా చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్​చేశారు. మంత్రి మీద ఫిర్యాదు చేస్తే రియాక్షన్ ఈ స్థాయిలో ఇంత ఫాస్ట్​గా ఉంటదా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్ వేధిస్తున్నారని, ఆయన్నుంచి ప్రాణహాని ఉందని మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్ బురుజు సుధాకర్​రెడ్డి హైదరాబాద్​లోని హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఆధారాలతో సహా మంత్రి కేటీఆర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశానన్నారు. కానీ, అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా మంత్రి శ్రీనివాస్​గౌడ్​అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో తనపై కక్ష కట్టారని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తన హత్యకు కూడా ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

కౌన్సిలర్ డబ్బులు వసూలు చేస్తుండు
మంత్రిపై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్​ను టీఆర్​ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ మహబూబ్ నగర్ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ ప్రకటించారు. ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం కాలనీ వాసుల నుంచి సుధాకర్​రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై మంత్రి హెచ్చరించినా తీరు మార్చుకోలేదని చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సుధాకర్​రెడ్డి కేసులు, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మంత్రిపై ఫిర్యాదు చేశాడని మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు విమర్శించారు.

హుటాహుటిన భూముల ఎంక్వైరీ
మహబూబ్​నగర్ అర్బన్ తహసీల్దార్ పార్థసారథి మంగళవారం సాయంత్రం హుటాహుటిన టౌన్​లోని రాంనగర్ హైస్కూల్​ఏరియాలో ఎంక్వైరీ చేశారు. స్కూల్ జాగా కబ్జా అయిందని.. బురుజు సుధాకర్ రెడ్డి 680 గజాల స్థలాన్ని ఆక్రమించి ఫేక్​ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలిందని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే కలెక్టర్​కు దీనిపై రిపోర్ట్ ఇస్తామని వివరించారు.