అధికార పార్టీకి నిరసనల సెగ తాకుతోంది. అభివృద్ధికి సహకరించడం లేదంటూ నేతలు ఫైర్ అవుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు మున్సిపల్ సమావేశాలను టీఆర్ఎస్ కౌన్సిలర్లు బాయ్ కాట్ చేయడం, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం క్యాతన్ పల్లి మున్సిపల్ సమావేశాన్ని టీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పినట్టే అధికారులు వింటున్నారే కానీ కౌన్సిలర్ల మాట వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులకు నిధులు ఎక్కువగా కేటాయించడం లేదని పేర్కొంటూ 7, 8 ,9 వార్డుల కౌన్సిలర్లు పోలం సత్యం, అల్గుల శ్రీలత, పారిపెల్లి తిరుపతిలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కుల స్రవంతి సైతం మీటింగ్ సమాచారం ఇవ్వడం లేదని సమావేశంలో వెల్లడించారు. ఇదే విషయంపై మున్సిపల్ ఆమె భర్త సత్యనారాయణ వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ ఆఫీసర్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితిలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడ్డారు.
