టీఆర్ఎస్ కులాల లెక్కలు చేస్తోంది. ఏ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకుంటే ఎన్ని ఓట్లు పడతాయి. ఏ కులానికి చెందిన నాయకుడికి ఏ పదవి ఇయ్యాలి. ఎవరి జయంతిని ఓన్ చేసుకుంటే ఎక్కవ లాభం జరుగుతుంది. ఇట్లాంటి లెక్కలే వేసుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కులాల ఓట్ల వేటలో స్ట్రాటజీలు వేస్తున్నారు. పార్టీకి ఏ కులం ఓట్లు దూరంగా ఉంటున్నాయి. ప్రతిపక్షాలకు ఏ ఓట్లు దగ్గరున్నాయో చూసి ఆ ఓట్లే టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ కులాల వారీగా ఓటు బ్యాంక్ పై దృష్టి పెట్టింది. అంతకుముందు కులాల వారీగా ప్రభుత్వ పథకాల పంపిణీ ఉన్నా.. ఇంత పక్కాగా ఓట్ల లెక్కలు చేయలేదు. ఇప్పుడు ఏ కులం ఓట్లు ఎటు పోతున్నాయో చూసిమరీ సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీరామారావు శత జయంతిని ఉపయోగించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈస్ట్రాటజీలో భాగంగానే టీఆర్ఎస్.. ఎన్టీఆర్ నామస్మరణ చేసిందనే విమర్శలు వినిస్తున్నాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ తో పాటు జై ఎన్టీఆర్ అని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు, గతంలో టీడీపీతో సంబంధం ఉన్న నేతలు విడివిడిగా జై ఎన్టీఆర్ అని నినదించటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత ఎన్నడూ ఎన్టీఆర్ ఊసెత్తని టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓట్లు, అక్కడక్కడ మిగిలిపోయిన టీడీపీ ఓటు బ్యాంక్ టార్గెట్ గానే టీఆర్ఎస్ ఈ స్ట్రాటజీని అమలు చేస్తోందన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లోని కమ్మ సామాజిక ఓట్ల కోసమే ఈకొత్త నినాదం అందుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాల్ సగానికి పైగా పార్టీ, ప్రభుత్వ పదవులు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఇచ్చిన టీఆర్ఎస్.. ఎన్టీఆర్ పేరుతో తమ వైపు తిప్పుకునే ప్రయత్నమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మున్నూరుకాపు సామాజిక వర్గాల ఓట్లు టార్గెట్ గా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రీసెంట్ గా గాయత్రి రవికి రాజ్యసభ పదవి ఇచ్చి.. ఆ ఓటు బ్యాంకును టార్గెట్ చేసింది. గాయత్రి రవి మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో ఆ సామాజిక వర్గ సంఘాలను తెరపైకి తెచ్చారు. సీఎం కేసీఆర్ మున్నూరు కాపుల పాలిట దేవుడని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. లోక్ సభ ఎన్నికలప్పటీ నుంచి మున్నూరు కాపు ఓట్లు బీజీపీవైపు ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గెలవటం.. దుబ్బాక, హుజూరాబాద్ లో మున్నూరుకాపు ఓట్లు బీజీపీకి పోలరైజ్ కావటంతో ఈఓటు బ్యాంక్ పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రెడ్డి కులంపై చేసిన కామెంట్స్ పైన టీఆర్ఎస్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. రెడ్డి ఓటర్లను ఆకర్శించేందుకే రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేసి ఉంటారని భావించిన టీఆర్ఎస్.... ఆ కామెంట్స్ ను తప్పు పట్టింది. రేవంత్ రెడ్డి.. దొంగరెడ్డి అని.. రెడ్డీలకు సీఎం కేసీఆర్ చాలా పదవులు ఇచ్చారని చెప్పుకున్నారు టీఆర్ఎస్ నేతలు. రెడ్డి సామాజిక వర్గ నేతల చేతనే కౌంటర్ లు ఇప్పించారు.
కులాల వారీగా ఎలా లాభం జరుగుతుందనే లెక్కలు వేసుకొని మరీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. వీళ్ళ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా లేదా అనేది తర్వాత తేలుతుంది.. కాని టీఆర్ఎస్ ప్లాన్లు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి.
