టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాకు పాల్పడుతోంది

 టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాకు పాల్పడుతోంది

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం ఇల్లీగల్ దందాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఫార్మా, ఇసుక, లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ బంధువులు, టీఆర్ఎస్ నాయకులే ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ ధరకే ఇసుక లభించేదని, కానీ ఇవాళ ఒక లారీ లోడు ఇసుకకు రూ.లక్ష ఖర్చు అవుతోందని అన్నారు. రెమిడెసివియర్ ఇంజక్షన్ తో జనాలను దోచుకున్న పార్థసారథి ఎంపీ అయ్యారని అన్నారు. ఎంపీ సంతోష్ ఇసుక మాఫియాకు డాన్ లా మారిండని ఆరోపించారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కూడా ఇసుక దందాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇల్లీగల్ దందాకు పాల్పడుతూ వేలకోట్ల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ఇసుక రేట్లు పెరిగాయని, ఎక్కడికక్కడే కొనుక్కోకుండా సెంట్రలైజ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇసుక ధరను తగ్గించడమే కాకుండా ఏ జిల్లాకా జిల్లాలోనే ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

మోడీకి తెలంగాణ గెస్ట్ హౌజ్ లా మారిందని, అందుకే మూడు రోజులున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి అకౌంట్ లో రూ.15 లక్షలు, అగ్నిపథ్, ఉద్యోగాల గురించి మోడీ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ప్రజల సమ్యలపై చర్చించడానికి కంటే కూడా రాష్ట్ర వంటకాలను తినడానికే బీజేపీ నాయకులు అధిక ప్రాధాన్యతనిచ్చారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు వస్తే... బీజేపీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడంలేదని నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారన్న జగ్గారెడ్డి... బీజేపీ, టీఆర్ఎస్ దొందూ దొందేనని ఫైర్ అయ్యారు.