
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేయని గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కొన్ని గ్రామాలు వర్షాలతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయినా టీఆర్ఎస్ సర్కారు ఉలకడం పలకడం లేదన్నారు. బుధవారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని దాసరి కాలనీలో పర్యటించారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు దాసరి కాలనీలోని ఇండ్లలోకి నీళ్లు చేరాయి. ఆ ఇళ్లను వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఆ ఇండ్ల వారితో మాట్లాడి, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ దత్తత గ్రామమైన చామనపల్లి పర్యటనకు ఆయన వెళ్లారు. ఊరు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండటంతో.. గ్రామ శివారులోనే నిలబడి ఫోన్ ద్వారా స్థానికులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చామనపల్లికి నిత్యావసర సరుకులు అవసరం ఉంటే విశాఖ ట్రస్టు ద్వారా అందిస్తామని ఆయన వెల్లడించారు.