మొన్న క్లౌడ్​ బరస్ట్​.. నిన్న పోలవరం

మొన్న క్లౌడ్​ బరస్ట్​.. నిన్న పోలవరం
  • కాళేశ్వరం ఫెయిల్యూర్​ దాచేందుకు రోజుకో కథ
  • మొన్న క్లౌడ్​ బరస్ట్​.. నిన్న పోలవరం
  • జనం దృష్టి మళ్లించేందుకు సర్కారు తంటాలు
  • వరల్డ్ క్లాస్ లిఫ్ట్ స్కీమ్‌‌ క్రెడిట్ గోదారి పాలైందనే ఆందోళన
  • వందల కోట్ల నష్టం గురించి మాట్లాడని ప్రభుత్వ పెద్దలు
  • పంప్‌‌హౌస్‌‌ల మునకపై కనీసం ప్రకటన లేదు
  • అసలు నష్టమే లేదన్నట్లుగా సర్కారు తీరు

హైదరాబాద్, వెలుగు: గోదావరి వరదలు ముంచెత్తిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు.. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీని దాచిపెట్టేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న రూ.లక్ష కోట్ల భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్టు పంపులు, మోటార్లు వరదలో చిక్కుకున్నాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంత పెద్ద ఫెయిల్యూర్‌‌‌‌ను దాచి పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కారు పొలిటికల్ డైవర్షన్ ఎజెండాను ఎంచుకుంది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కట్టుకథ అల్లుతోంది. ఇటీవల సీఎం, మంత్రులు చేస్తున్న వివాదాస్పద కామెంట్లన్నీ ఇందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అటెన్షన్ డైవర్షన్ ప్లాన్

కాళేశ్వరం మోటార్లు, పంపులన్నీ మునిగిపోవడంపై జనంలో చర్చ జరిగితే.. ఇప్పటివరకు చెప్పిన గొప్పలన్నీ గోదాట్లో కొట్టుకుపోతాయని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే విమర్శల నుంచి తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కొత్త వివాదాలు తెరపైకి  తెచ్చిందనే  వాదనలున్నాయి.  ఈ నేపథ్యంలోనే గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందని.. ఈ భారీ వానల వెనుక విదేశీ కుట్ర ఉండవచ్చని చూచాయగా తమకు సమాచారముందని భద్రాచలంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.  ప్లాన్ ప్రకారమే కాళేశ్వరం మునకను తెరమరుగు చేసేందుకు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రెండు రోజులపాటు రాజకీయ వర్గాల చర్చలన్నీ క్లౌడ్​ బరస్ట్ చుట్టే ముసురుకోవటంతో.. తాము అనుకున్న ప్లాన్ సక్సెసయిందనే ఆనందం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమైంది. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ తాజాగా పోలవరం వివాదం తెరపైకి తెచ్చి.. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరటం వెనుక కూడా టాపిక్ డైవర్షన్ ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరంతోనే భద్రాచలం మునిగిందని, ఏపీ ఆ ప్రాజెక్టు డిజైన్‌‌‌‌‌‌‌‌ మార్చి మూడు మీటర్లు ఎత్తు పెంచడంతోనే వరద ముంచెత్తిందని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు. ఇది నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని, ఎత్తు తగ్గించాలని, ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పువ్వాడకు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రులు ఉమ్మడి ఏపీని అలాగే ఉంచాలని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ఏపీకి ఇవ్వాలంటూ కామెంట్ చేశారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. స్వయంగా కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్పుడు అనూహ్యంగా టీఆర్ఎస్​ పోలవరం వివాదం లేవనెత్తడం కూడా.. విదేశీ కుట్ర కామెంట్లలా పొలిటికల్ డైవర్షన్ ఎజెండాలో భాగమేనని చర్చ జరుగుతున్నది.

ఏం జరగనట్లు సర్కారు తీరు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లను గోదావరి వరదలు ముంచెత్తాయి. మొత్తం 29 మోటార్లు మునిగిపోయాయి. ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఇంజనీర్లు చెబుతున్నారు. దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని అనధికార అంచనా. ఇంత జరిగినా అక్కడేం జరగనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రపంచ స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ముప్పు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకు లేకపోవటం అనుమానాలు రేకెత్తిస్తోంది. వరద ముంచెత్తి 4 రోజులైనా అక్కడేం జరిగింది, ప్రాజెక్టుకు ఏమైంది, ఎంత నష్టం వాటిళ్లింది వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఇరిగేషన్ విభాగం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నీట మునిగిన మోటార్లు మళ్లీ పని చేస్తాయా లేదా, పునరుద్ధరణ ఎప్పటికల్లా జరుగుతుందనే వివరాలనూ ప్రభుత్వం గోప్యంగా ఉంచటం ఈ భారీ ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎల్లూరు పంప్​హౌస్‌‌‌‌‌‌‌‌ రెండేళ్ల కిందట నీట మునిగితే.. ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. శ్రీశైలం పవర్ హౌస్‌‌‌‌‌‌‌‌ నీట మునిగి మంటలు చెలరేగితే.. ఇప్పటికీ ఏం జరిగిందో అంచనాకు రాలేదు. ఈ లెక్కన కాళేశ్వరం మోటార్లు మళ్లీ తేలుతాయా, మునుగుతాయా అనేది తెలియడం లేదు.

పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ల దగ్గరికి పోనిస్తలే

అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల పరిసరాల్లో పోలీస్‌‌‌‌‌‌‌‌ పహారా ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల వైపునకు మీడియా వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులతో అడ్డుకుంటున్నారు. డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌ కోసం నియమించిన సిబ్బందితోపాటు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు, వర్క్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ ప్రతినిధులు తప్పా ఇంకెవ్వరినీ పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. పరిశీలించేందుకు వెళ్లిన రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ఆకునూరి మురళిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇతరలు వెళ్తే వెనక్కి పంపుతున్నారు


శ్రీశైలం పవర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో మంటలకు రెండేళ్లు


శ్రీశైలం లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 2020 ఆగస్టు 21న జరిగిన పేలుడుతో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందారు. పవర్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న టైంలోనే బ్యాటరీలను మార్చేందుకు ప్రయత్నించడంతో నాలుగో యూనిట్‌‌‌‌‌‌‌‌లో పేలుడు సంభవించింది. క్షణాల్లోనే మంటలు, పొగవ్యాపించడంతో అక్కడే చిక్కుకుపోయిన అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి రెండేళ్లవుతున్నా నాలుగో యూనిట్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ప్రమాదం ఎలా జరిగిందో నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ నివేదికను ఇప్పటిదాకా బయట పెట్టలేదు. ప్రమాదానికి ప్రభుత్వం, జెన్‌‌‌‌‌‌‌‌కో నిర్లక్ష్యమే కారణమని తేలుతుందని భావించిన రాష్ట్ర సర్కారు.. ఆ నివేదికను తొక్కిపెట్టినట్టుగా సమాచారం.

మునగని దేవాదులే సాక్ష్యం

కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం లేదన్నట్లు, సర్కారు వైఫల్యం కాదన్నట్లు.. నెపాన్ని పూర్తిగా వానలు, వరదలపై నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వందల ఏండ్లలో ఎన్నడూ లేని రికార్డు స్థాయి వరదలు వచ్చాయని చెబుతున్నారు. మరి అదే నిజం అనుకుంటే.. 18 ఏండ్ల కింద నిర్మించిన, 14 ఏండ్ల నుంచి పని చేస్తున్న దేవాదుల ప్రాజెక్టు ఎందుకు మునగలేదని ఇరిగేషన్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి దేవాదులలో వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ మోటార్లు, పంపులు మునగకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కారు చెబుతున్నవి కట్టుకథలేననే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.