
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఆవిర్భావం కాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. ఆలాగే దళితులకు మూడెకరాలు, నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి కేసీఆర్ దగా చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ ను పెంచడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైందని రామచందర్ రావు ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. అప్పుల కుప్పగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు,వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.