టీఆర్​ఎస్​ పేరే మారుతది.. కారు గుర్తు అట్లనే ఉంటది

టీఆర్​ఎస్​ పేరే మారుతది.. కారు గుర్తు అట్లనే ఉంటది
  • బీజేపీకి, మనకే పోటీ.. మంత్రులు, టీఆర్​ఎస్ ​జిల్లా అధ్యక్షులతో కేసీఆర్​
  • బీఆర్‌‌ఎస్‌‌ వైపే మొగ్గు.. పరిశీలనలో ఇంకో మూడు పేర్లు
  • డిసెంబర్‌‌ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాబోయే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి, తమకు మధ్యే పోటీ ఉంటుందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతున్నదని విమర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌‌‌‌లో మంత్రులు, టీఆర్​ఎస్​ జిల్లాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వారితో కలిసి లంచ్‌‌‌‌ చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను జాతీయ పార్టీగా మార్చడంపై చర్చించారు. ‘‘మారేది పార్టీ పేరు మాత్రమే.  కారు గుర్తు, గులాబీ జెండా మనకే ఉంటుంది. దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌‌‌‌లో సమావేశమై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరు మార్చుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేద్దాం. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌‌‌‌, జిల్లా పరిషత్‌‌‌‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌‌‌‌, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానిస్తున్నం. మొత్తం 283 మంది టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నాయకత్వం పార్టీ పేరును మార్చుతూ తీర్మానం చేయాల్సి ఉంది” అని అన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను జాతీయ పార్టీగా పేరు మార్చుతూ తీర్మానం చేద్దామని తెలిపారు. ఈ సమావేశానికి దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తామన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ (భారత రాష్ట్ర సమితి)గా మార్చాలని ఎక్కువ మంది సూచించారు. భారత వికాస సమితి, మరో 2 పేర్లపైనా చర్చించారు. దసరా రోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండాను మీడియాకు  వెల్లడిస్తానని కేసీఆర్‌‌‌‌ వివరించారు. సమావేశంలో చేసిన తీర్మానం ప్రతులతో ఈ నెల 6న ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఢిల్లీకి వెళ్లి సీఈసీకి వాటిని అందజేస్తారని తెలిపారు. పార్టీ పేరు మారేదాకా  వినోద్‌‌‌‌ నేతృత్వంలోని టీం ఫాలో అప్‌‌‌‌ చేస్తుందన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తానే ఉంటానని, ఆరుగురు కో ఆర్డినేటర్లను నియమిస్తామని తెలిపారు. పార్టీ పేరు మారి, కేంద్ర ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యాక జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని, పొలిట్‌‌‌‌ బ్యూరోను ఎన్నుకుంటామన్నారు.  

నేడు కోనాయపల్లికి కేసీఆర్‌‌‌‌

కేసీఆర్ సోమవారం సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం ఏ పని తలపెట్టినా ఈ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీని వీడి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏర్పాటు చేసేప్పుడు ఇదే ఆలయంలో పూజలు చేశారు. ఎన్నికలకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు చేశాకే నామినేషన్‌‌‌‌ వేయడం సహా ప్రచారం, ఇతర పనులు చేపడుతారు. దసరా రోజు జాతీయ పార్టీని ప్రకటిస్తుండటంతో కోనాయపల్లి ఆలయంలోపూజలు చేయనున్నారు.

డిసెంబర్‌‌‌‌ 9న ఢిల్లీలో సభ

డిసెంబర్‌‌‌‌ 9న ఢిల్లీలో జాతీయ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్‌‌‌‌ తెలిపారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ఉద్యమ నాయకులతో పాటు అనేక ప్రాంతీయ పార్టీల నాయకులు హాజరవుతారని అన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రతిపక్ష నేతల మాటలను ఎవరూ పట్టించుకోవద్దని నేతలకు ఆయన సూచించారు. కొన్ని పార్టీలు తమ జాతీయ పార్టీలో విలీనం కాబోతున్నాయని, సక్సెస్‌‌‌‌పై ఎవ్వరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు.