
సర్పంచ్ భర్తపై పీఆర్ కార్యదర్శుల సంఘం డిమాండ్
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: మహిళా పంచాయతీరాజ్ సెక్రటరీని బూతులు తిడుతూ నడిరోడ్డుపై దాడికి పాల్పడిన సర్పంచ్ భర్త, టీఆర్‌ఎస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు గౌర రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో ఆఫీస్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మంగళవారం ఇరుకుల్ల పంచాయతీ కార్యదర్శి పద్మ గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పింఛను ప్రొసీడింగ్స్ పంపిణీ చేపట్టారన్నారు. ఆ సమయంలో అక్కడకి వచ్చిన గ్రామ సర్పంచి భర్త బలుసుల శంకర్ ప్రొసీడింగ్స్ పంచడానికి నువ్వెవరంటూ బూతులు తిడుతూ మహిళా ఉద్యోగిని అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడన్నారు. దాడికి పాల్పడిన అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, పంచాయతీ రాజ్ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. నల్లబ్యాడ్జీలతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పీఆర్ సెక్రటరీల సంఘం కార్యదర్శులు సుమన్, కిరణ్ కుమార్, కనకయ్య, విజయలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.