
మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు రోజూ చాలా మాట్లాడుతున్నారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాళ్లకంత సీన్ లేదని… పార్టీ నేతలకు చెప్పారాయన. రంగారెడ్డి, హైదరాబాద్ టీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్… మున్సిపోల్స్ లోనూ… వార్ వన్ సైడే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశానికి డుమ్మా కొట్టిన ఓ ఎమ్మెల్యేపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మీటింగ్ కు రానివారి నుంచి వివరణ కోరాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేటీఆర్ ఆదేశించారు.
సిటీలో చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వాలు 50 వేలకు చేరుకోకపోవడంపై కేటీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నగరంలో ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో… హైదరాబాద్ ఎమ్మెల్యేలకు… ఇతర మున్సిపాలిటీల్లో బాధ్యతలు అప్పజెప్పనున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. పార్టీ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస మీటింగ్ లు జరుపుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక… ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆ తర్వాత.. కొన్నాళ్లకే నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉందని నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నేతలంతా.. మున్సిపోల్స్ కు రెడీ కావాలని కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అర్బన్ ఓటర్లతో జాగ్రత్తగా ఉండాలని.. వాళ్లను పద్ధతిగా డీల్ చేయాలంటూ కీలక సూచనలిస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీకి ఇంచార్జ్ లుగా ఇద్దరు ఎమ్మెల్యేలను నియమించనున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా ఇతర మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లుగా పంపనున్నారు. పంచాయతీ, జడ్పీ ఎన్నికల తరహాలోనే.. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు కేటీఆర్.