స్ట్రాంగ్ రూమ్ EVMల మధ్య TRS నేత : పార్టీ వివరణ

స్ట్రాంగ్ రూమ్ EVMల మధ్య TRS నేత : పార్టీ వివరణ

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లో ఓ టీఆర్ఎస్ నేత ఫొటోలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలోని మేడ్చల్, కుత్బుల్లా పూర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్​పల్లి, ఎల్బీ నగర్, కంటోన్మెంట్​కు సంబంధించిన ఈవీఎంలను, వీవీ ప్యాట్లను గురువారం పోలింగ్ ముగిశాక కీసర మండలం బోగారం హోలీ మేరీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు తీసుకెళ్లారు. శుక్రవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల అధికారులు వీటికి సీల్ వేసి భద్రపరిచారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ కి వచ్చిన కీసర మండల టీఆర్ఎస్ నేత నాయకపు వెంకటేష్ తనకు సంబంధం లేని కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన స్ట్రాంగ్ రూమ్ కి వెళ్లారు. 

నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూమ్ లోకి సెల్ ఫోన్లను అనుమతించరనీ.. సెల్ ఫోన్ తో టీఆర్ఎస్ నేత స్ట్రాంగ్ రూమ్ లోకి ఎలా వెళ్లారని, ఫొటోలు ఎలా దిగారని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది నిఘా వైఫల్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ఫుల్లు వైరల్ అయ్యాయి. స్ట్రాంగ్ రూమ్స్ అధికార పార్టీ నేతలకు ఏం పని.. ఈసీ ఏం చేస్తోంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా దుమారం రేపిన ఈ వ్యవహారంపై జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంవీ రెడ్డి.. పూర్తి విచారణ జరపాలని ఏఆర్వోలను ఆదేశించారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు.. ఈ వైరల్ ఫొటోలపై టీఆర్ఎస్ పార్టీ వివరణ ఇచ్చింది. ఆ నాయకుడు ఒక్కడే వెళ్లలేదనీ… ఈసీ అధికారులు పార్టీ ఏజెంట్లతో కలిసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లారని.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు.