డ్రైన్లపై స్లాబులతోనే సమస్య..గ్రేటర్ వరంగల్ లో డ్రైనేజీ కాల్వలను కమ్మేసిన షాపులు, కమర్షియల్ బిల్డింగ్లు

డ్రైన్లపై స్లాబులతోనే సమస్య..గ్రేటర్ వరంగల్ లో డ్రైనేజీ కాల్వలను కమ్మేసిన షాపులు, కమర్షియల్ బిల్డింగ్లు
  • ఎక్కడికక్కడ స్లాబులు ఏర్పాటు చేయడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు
  • రోడ్లు, కాలనీలను ముంచెత్తుతున్న నీళ్లు
  • లైట్ తీసుకుంటున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలకు తప్పని ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో ఒక్క వాన పడితే చాలు చాలాచోట్ల రోడ్లు జలమయం అవుతున్నాయి. వరద నీరు చేరి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇరుకైన డ్రైనేజీ వ్యవస్థ ఉండడం, ప్రధాన నాలాలు, డ్రైన్లను ఆక్రమించి ఎక్కడికక్కడ స్లాబులు ఏర్పాటు చేయడం సమస్యగా మారింది. వరద నీరు నేరుగా కాల్వల్లోకి వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు డ్రైనేజీలు, నాలాలపై ఉన్న స్లాబులను తొలగించడంపై ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

1,800కు పైగా కాలనీలు..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 66 డివిజన్లలో 1,800కు పైగా కాలనీలున్నాయి.  సిటీలో వరద, మురుగు నీటి ప్రవాహానికి ప్రధాన నాలాలు 53.5 కిలోమీటర్లు, ఇంటర్నల్ డ్రైనేజీ వ్యవస్థ మరో 1,640 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అయితే చాలా వరకు నాలాలు, ఇంటర్నల్ డ్రైనేజీలు 5 నుంచి 10 సెం.మీ. వర్షాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. ఒక్క గట్టి వాన పడితే కాల్వలన్నీ నిండుకుండలా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ముఖ్యమైన నగరం కావడం,  రెండో రాజధానిగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో కనీసం 20 సెం.మీ. వర్షం కురిసినా తట్టుకునే స్థాయిలో నాలాలు, ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టం ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.

చాలా జంక్షన్లలో నాలాలు కనిపించట్లే..

నగరంలో చాలా చోట్ల షాపులు, కమర్షియల్ బిల్డింగ్​లు, అపార్ట్​మెంట్ల యజమానులు కాల్వలను ఆక్రమించి, స్లాబులు వేసి, వాటిని మూసేశారు. దీంతో వర్షాలు పడితే వరద నేరుగా కాల్వలోకి చేరకుండా రోడ్ల మీదికో, పక్కనే ఉన్న లోతట్టు కాలనీల్లోకో పరుగులు తీస్తోంది. ఉదాహరణకు హనుమకొండ గోకుల్ నగర్ టీ-జంక్షన్ నుంచి అంబేద్కర్ భవన్ కు వెళ్లే రూట్ లో రోడ్డుకు ఒకవైపే డ్రైనేజీ ఉండగా.. దాన్ని మొత్తం స్లాబులతో కమ్మేశారు. వాన పడిన ప్రతీసారి ఈ ప్రాంతమంతా జలమయం అవుతోంది. తాజాగా ముంపు సమస్య పరిష్కారం కోసం ఎత్తుగా కొత్త రోడ్డు వేసినా.. వరద నీరు చుట్టుపక్కల కాలనీల్లోకి చేరుతోంది. ఇక హనుమకొండలోని గోపాలపూర్, కాకాజీ కాలనీ, హనుమకొండ చౌరస్తా, అలంకార్, ములుగురోడ్డు, ఎంజీఎం సర్కిల్, బట్టల బజార్, పోచమ్మ మైదాన్.. ఇలా సిటీలో వర్షపు నీరు చేరే చాలా జంక్షన్లలో కనీసం చూద్దామన్నా నాలాలు కనిపించని దుస్థితి నెలకొంది.  

చర్యల్లేవని ఆరోపణలు..

నగరంలో నాలా ఆక్రమణలు, స్లాబుల కారణంగా ముంపు సమస్య ఏర్పడుతోంది. వీటిపై మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా గ్రేటర్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వరద నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతోపాటు ప్రధాన నాలాలు, డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన స్లాబులు తొలగించాల్సి ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రధాన జంక్షన్లతో పాటు కాలనీల్లోకి వరద చేరుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు డ్రైన్లు, నాలాలపై ఫోకస్ పెట్టాలని, వరద ప్రవాహానికి అడ్డంకులు సృష్టించే స్లాబులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.