
అమెరికా టారిఫ్ల నేపథ్యంలో మరోసారి దేశం స్వదేశీ మంత్రాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. కేవలం దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం కాకుండా, ఉద్యమ స్ఫూర్తితో, వాణిజ్య, దౌత్య, విదేశాంగ విధానాల కోణాల నుంచి సమగ్రంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 2018లో ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య చట్టం సెక్షన్ 232 ప్రకారం భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు ఉత్పత్తులపై 25%, అల్యూమినియం ఉత్పత్తులపై 10% సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా 2019లో భారత్ కూడా అమెరికా నుండి దిగుమతి అయ్యే 28 ఉత్పత్తులపై, ముఖ్యంగా బాదం, ఆపిల్, పప్పుధాన్యాలు, రసాయనాల వంటి వాటిపై ప్రతీకార సుంకాలు విధించింది.
ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఒడిదుడుకులకు గురిచేశాయి. 2019 జూన్ 5న, అమెరికా భారత్కు ఇస్తున్న జీఎస్పీ హెూదాను రద్దు చేసింది. దీనివల్ల భారత్ నుంచి సుమారు 5.7 బిలియన్ల విలువైన ఎగుమతులపై అమెరికా సుంకాలు విధించడం మొదలుపెట్టింది. ఈ రద్దు భారతదేశంలో రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతిదారులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
విదేశాంగ విధానంపై ప్రభావం
స్వదేశీ నినాదం అనేది ఆనాటి ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందినా, దాని లక్ష్యాలు, అమలు విధానాలు పూర్తిగా భిన్నం. ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం కాదు, అంతర్జాతీయంగా పోటీపడగలిగే విధంగా మన దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాలను అనుసరిస్తోంది. ఉత్పత్తి- అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీ.ఎల్.ఐ). 2020లో ప్రారంభమైన ఈ పథకం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినది. మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి 14 కీలక రంగాలకు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోంది.
ఈ పథకం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, దేశీయ ఉత్పత్తిని పెంచి, ఎగుమతులను ప్రోత్సహించడం లక్ష్యం. మన దేశంలో కొవిడ్-19 సమయంలో సరఫరా గొలుసులు దెబ్బతిన్నప్పుడు, భారతదేశం దేశీయంగా మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, చివరికి వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేయగలిగింది. ఇది ఆచరణాత్మక విజయాన్ని చూపించింది. దీనికి కొనసాగింపుగా కీలక రంగాలలో దేశీయ సరఫరా గొలుసులను బలోపేతం చేయాలి.
ఆర్థిక విధానంలో మార్పు
స్వదేశీ ప్రాధాన్యత ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రపంచ స్థాయిలో, సంరక్షణవాద విధానాలు పెరుగుతున్నందున, స్వదేశీ విధానం విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆకస్మిక అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నుంచి మన దేశాన్ని కాపాడుతుంది.
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ఏదేశం ఒత్తిడికి లొంగకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నినాదం దోహదపడుతుంది. వ్యాపారప్రభావం ఈ విధానం భారతీయ కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇది దేశీయపెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయ కంపెనీలను కూడా భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ఆకర్షిస్తుంది.
ఆధునిక స్వదేశీ ఉద్యమం
ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడు ఒక దేశం అంతర్జాతీయ వేదికలపై తన వాణిని బలంగా వినిపించగలదు. ఉదాహరణకు, రష్యా-, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, భారత్ తన దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. ఈ నిర్ణయం, భారత్ ఏ దేశం ఒత్తిడికి లొంగకుండా తన ప్రయోజనాలను కాపాడుకోగలదని నిరూపించింది.
ఒక దేశం ఎంత తక్కువగా ఇతరులపై ఆధారపడితే, అది అంత స్వతంత్రంగా వ్యవహరించగలదు. ఇది భారతదేశాన్ని ప్రపంచంలో ఒక తయారీ కేంద్రంగా, ఒక బలమైన శక్తిగా నిలబెట్టగలదు. ఇది కేవలం మన దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం కాదు, మన దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఒక ఆర్థిక, దౌత్యపరమైన ప్రస్థానం.
- డా. రావుల కృష్ణ,
అసిస్టెంట్ ప్రొఫెసర్,హెచ్సీయూ